కీర్తనలు త్యాగరాజు నీవంటి దైవమును షడానన
తోడి - ఆది
పల్లవి:
నీవంటి దైవమును షడానన
నేనెందు కానరా నీ..
అను పల్లవి:
భావించి చూడఁ దరముగాని
బ్రహ్మపురి నిలయ గిరిజాతనయ నీ..
చరణము(లు):
సరిబాలురతోఁ గైలాసగిరిని
శుభాకృతితోఁ నాడఁగను
వెఱపులేక ప్రణవార్థము తానను
విధిని కోపగించి
సరగున నవవీరులందొక కిం
కరుని గని ముమ్మారు సెలవిచ్చి
సురలు మురపురారులు విని మెచ్చగ
వరుసగాను సృష్టిశక్తి నొసఁగిన నీ..
హరిహరాదులకు దిక్పాలుల
కల శశిసూర్యులకు
మఱి విద్యాధరులకు బ్రహ్మాండములను
వెలసే వరవీరాదులకుఁ
దరముగాక నిన్ను జతగూడుక
శరణముగా విని సైరించక
పరమద్రోహియైన శూర పద్మా
సురుని కీర్తిగాను గర్వమణచిన నీ..
మారకోటులందుఁ గల్గిన శృం
గారమెల్ల ఇందుముఖ నీ కొన
గోరును బోలునె యటువంటి శుభా
కారము సంతతము
సారెకు నామదిని నిల్పిన కు
మార దయావర నీరజలోచన
తారకాథిప కలాధరుఁడగు శ్రీ
త్యాగరాజ సన్నుతాశ్రితహిత నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niivaMTi daivamunu shhaDaanana ( telugu andhra )