కీర్తనలు త్యాగరాజు ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా ముదితలార జూతము రారే
మధ్యమావతి - ఆది
పల్లవి:
ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా?
ముదితలార జూతము రారే ॥ముచ్చట॥
అను పల్లవి:
పచ్చని దేహిని పరమ పావనిని
పార్వతిని దలచుచు హరుడేగెడు ॥ముచ్చట॥
చరణము(లు):
చల్లని వేల్పుల రీతి నరుల కర
పల్లవములను తళుక్కనుచు బిరుదు
లెల్ల మెరయ నిజభక్తులు పొగడగ
ఉల్లము రంజిల్ల
తెల్లని మేనున నిండు సొమ్ములతో
మల్లెహారములు మఱిశోభిల్లగ
చల్లని వేళ సకల నవరత్నపు
పల్లకిలో వేంచేసి వచ్చెడు ॥ముచ్చట॥
హితమైన సకల నైవేద్యంబుల సం
మతమున అడగడుగు కారగించుచు
మితములేని యుపచారములతో
నతిసంతోషమున సతతము జ
ప తపముల నొనరించు
నతజనుల కభీష్టము లవ్వారిగ
వెతకి యొసగుదుననుచు పంచనదీ
పతి వెడలి సొగసు మీరగ వచ్చెడు ॥ముచ్చట॥
భాగవతుల హరి నామ కీర్తనము
బాగుగ సుస్వరములతో వింత
రాగములను యాలాపము చేయు వై
భోగములను జూచి
నాగభూషణుఁడు కరుణానిధియై
వేగము సకల సుజన రక్షణమున
జాగరూకుఁడై కోర్కెలనొసగు
త్యాగరాజు తాననుచును వచ్చెడు ॥ముచ్చట॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - muchchaTa brahmaadulaku dorakunaa muditalaara juutamu raaree ( telugu andhra )