కీర్తనలు త్యాగరాజు మేలు మేలు రామనామ సుఖ
సౌరాష్ట్ర - ఆది
పల్లవి:
మేలు మేలు రామనామ సుఖ
మీ ధరలో మనసా
ఫాలలోచన వాల్మీకాది
బాలానిలజాదులు సాక్షిగ మే..
అను పల్లవి:
నిండుదాహముఁగొన్న మనుజులకు
నీరుఁ ద్రాగిన సుఖంబుకంటే
చండదారిద్ర మనుజులకు ధన
భాండమబ్బిన సుఖంబుకంటే మే..
చరణము(లు):
ఆకలివేళల పంచభక్ష్య పర
మాన్నమబ్బిన సుఖంబుకంటే
శ్రీకరుఁడౌ శ్రీరాముని మనసున
చింతించు సుఖంబుకంటే మే..
సారహీనమౌ క్రోధ సమయమున
శాంతము గల్గు సుఖంబుకంటే
నేరని మూఢులకు సకల విద్యా
పారముఁ దెలియు సుఖంబుకంటే మే..
రామునిపై నిజభక్తి కలిగి గాన
రసముఁ దెలిసిన సుఖంబుకంటే
పామర చెలిమి సేయనివారి
భావములోని సుఖంబుకంటే మే..
చేయఁదగు వేదాంత విచారణ
చేయఁగ గల్గు సుఖంబుకంటే
బాయక నిర్గుణభావముగల పర
బ్రహ్మానుభవ సుఖంబుకంటే మే..
రాజస తామస గుణములులేని
పూజలఁగల్గు సుఖంబుకంటే
రాజశిఖామణియైన త్యాగ
రాజుకొసంగు సుఖంబుకంటే మే..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - meelu meelu raamanaama sukha ( telugu andhra )