కీర్తనలు త్యాగరాజు యుక్తము గాదు నను రక్షింపక యుండేది రామ
శ్రీ - ఆది
పల్లవి:
యుక్తము గాదు నను రక్షింపక యుండేది రామ ॥యుక్తము॥
అను పల్లవి:
భక్తవత్సల! పతితపావన! త్రి
శక్తులు గల్గిన దేవుఁడు నీవై ॥యుక్తము॥
చరణము(లు):
తొలి దుష్కృతముల నణచు నీ బిరు దిలను దడుసుకొనెనో?
పలికి బొంకడను నీ కీర్తియు నే బాగలేదు యనెనో? మును
తెలిసి తెలియని నీ దాసులఁ బ్రోవ దేవ! దయరా ననెనో?
వెలసిన భక్తులకే నీ శక్తియు సెలవై పోయెనో? దెలుపుము ॥యుక్తము॥
వద్దయుండు జనకాత్మజ బల్క వద్దనెనో? లేక
నిద్దురజితుఁ డతికోపముతోడను నీ కేల యనెనో?
ముద్దు భరతుఁడానంద బాష్పములఁ గనుల నించెనో?
పద్దున పవనసుతుఁడు వద్దని నీ
పదము బట్టుకొనెనో? దెలుపుము ॥యుక్తము॥
చల్లని నీ భక్తియు లేదని విధి కల్ల లాడుకొనెనో? నా
వల్ల గాదని పల్కి చెలి మిక్కిలి వార్త లాడుకొనెనో?
ఉల్లమునను శ్రీ త్యాగరాజు ని న్నుంచుకొన మరచెనో?
చెల్లెలైన ధర్మ సంవర్ధని చేరఁ బోకుమనెనో? దెలుపుము ॥యుక్తము॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - yuktamu gaadu nanu raxiMpaka yuMDeedi raama ( telugu andhra )