కీర్తనలు త్యాగరాజు రారా మా యింటిదాఁక రఘు
అసావేరి - ఆది
పల్లవి:
రారా మా యింటిదాఁక రఘు
వీర సుకుమార మ్రొక్కేరా ॥రా॥
అను పల్లవి:
రారా దశరథకుమార నన్నేలు
కోరా తాళలేరా రామ ॥రా॥
చరణము(లు):
ప్రొద్దునలేచి పుణ్యముతోడి
బుద్ధులుచెప్పి బ్రోతువుగాని
ముద్దుగారు నీ మోమును జూచుచు
వద్దనిలిచి వారము పూజించెద ॥రా॥
కోరిన కోర్కులు కొనసాగకనే
నీరజనయన నీ దారినిగని వే
సారితిగాని సాధుజనావన
స్వారివెడలి సామినేఁడైన ॥రా॥
దిక్కులేదనుచుఁ దెలిసి ననుఁ బ్రోవఁ
గ్రక్కునరావు కరుణను నీచేఁ
జిక్కియున్నదేల మఱతురా
శ్రీ త్యాగరాజుని భాగ్యమా ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raaraa maa yiMTidaa.rka raghu ( telugu andhra )