కీర్తనలు త్యాగరాజు లాలి గుణశాలి వనమాలి సుహృదయన
కేదారగౌళ - జంప
పల్లవి:
లాలి గుణశాలి వనమాలి సుహృదయన
లాలి మృదుతర హంస తూలికా శయన
లాలి లాలయ్య లాలి ॥లా॥
చరణము(లు):
ఇనవంశమందు జనియించిన ఘనాభ
కనకమయచేల దినకర కోటి శోభ
వనజనయనాక్రూరవరదాబ్జనాభ
సనకాదినుత సకల సద్భక్త సులభ ॥లా॥
కరకలితశరచాప ఖరశిరోహరణ
అరుణాబ్జనిభచరణ అసురమదహరణ
పురవైరివినుత సంపూర్ణశశివదన
కరుణారసాక్ష గతకామమునిశరణ ॥లా॥
పుడమివరద నాదుపూజ గైకొనుమా
కడు నమ్మువారింట కలుగు శ్రీకరమా
కడకంటిచూపు నీ కది చాల ఘనమా
ఎడబాయజాల నన్నేలు కులధనమా ॥లా॥
కోటిసూర్యప్రభల గేరు మంటపము
చాటుగా నలంకరించినది నెలకొనుము
సాటి దొరకని సాధు జనవంద్య విడెము
మాటిమాటికి నొసఁగి మఱవక గొలుతుము ॥లా॥
అందు మధ్యంబునను అపరంజితోను
సుందరంబైన మంచము వేసినాను
అందుపై జాజులను అమరపరిచాను
అందమౌ నీ పాదయుగముఁ బట్టేను ॥లా॥
అసమానసూర ముక్తావళులు మెఱయ
అసమానగిరిమధ్య కుసుమములు గురియ
బిసరుహభవాది సురబృందకోట్లరయ
అసలైన బిరుదులిడి యూచెదను సదయ ॥లా॥
భాగవతసేవలో బడలియున్నావు
రాగవిరహిత నన్ను మఱవఁగఁ బొయ్యేవు
బాగైన జనకజాభాగ్యమా నీవు
త్యాగరాజుని నిండు దయచేసి బ్రోవు ॥లా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laali guNashaali vanamaali suhR^idayana ( telugu andhra )