కీర్తనలు త్యాగరాజు శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన
సామ - ఆది
పల్లవి:
శాంతములేక సౌఖ్యములేదు - సారసదళనయన ॥శాం॥
అను పల్లవి:
దాంతునికైన వే - దాంతునికైన ॥శాం॥
చరణము(లు):
దారసుతులు ధన ధాన్యము లుండిన
సారెకు జప తప సంపదగల్గిన ॥శాం॥
యాగాదికర్మము లన్నియుఁజేసిన
బాగుగ సకలహృద్భావముఁ దెలిసిన ॥శాం॥
ఆగమశాస్త్రము లన్నియు జదివిన
భాగవతులనుచు బాగుగఁ బేరైన ॥శాం॥
రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ
రాజవినుత సాధురక్షక తనకుప ॥శాం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - shaaMtamuleeka saukhyamuleedu - saarasadaLanayana ( telugu andhra )