కీర్తనలు త్యాగరాజు సీతామనోహర, శృంగార శేఖర
రామమనోహరి - ఆది
పల్లవి:
సీతామనోహర, శృంగార శేఖర ॥సీతా॥
అను పల్లవి:
వాతాశనారి వరవాహన వారిజాసనాది సన్నుతపద ॥సీతా॥
చరణము(లు):
తొలి జన్మముల నే జేసిన పూజా
ఫలమో లేక నీదు కటాక్ష
బలమో నీవాడను నేనని లోకులు
బల్కగా ధన్యుఁడ నైతిని ॥సీతా॥
దీనలోక సంరక్షక దైవా
ధీనము గాదు నీ రూపము నాదు
మానసమున నాటి యుండగ నే
నెంతటి భాగ్యశాలినో ॥సీతా॥
దిట్ట తనమునను భక్తి స్థిరమౌ
నట్టుగా శ్రీరామ యెన్నటికిఁ
గట్టిగాను త్యాగరాజుని చై
బట్టి రక్షించి యేలుకోవయ్య ॥సీతా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - siitaamanoohara, shR^iMgaara sheekhara ( telugu andhra )