కీర్తనలు త్యాగరాజు సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది
ఆరభి - చాపు
పల్లవి:
సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది
సురలకైన తరమా సుం..
అను పల్లవి:
కుందరదన సనందనాది
వందిత నేనెంత త్రిపుర సుం..
చరణము(లు):
కలకలమను ముఖకళలను గని కలు
వలరాజు భువికి రాఁడాయె
చెలఁగు నీ లావణ్యమును గని
యలనాఁడె వలరాజు గానకపోయె
నిలువరమగు నీ గంభీరమును గని
జలరాజు జడవేషుఁడాయె
బలమైన ధీరత్వమును గని కనకా
చలుఁడు తా శిలరూపుఁడాయె త్రిపుర సుం..
కనులను గని సిగ్గుబడి గండుమీనులు
వనధివాసము సేయనాయె
జనని నీ చిఱునవ్వుకాంతి సోకి శివుఁ
డనుపమౌ శుభ్రుఁడాయె
మినుకు సొమ్ముల చేలకాంతులు మెఱపులు
గని నిమిషము నిలువదాయె
కనకాంగి నీ స్వరమును విని వాణి మ
గని జిహ్వను దాఁ బూనికాయె త్రిపుర సుం..
పావనము సేయు బిరుదును గని భక్త
పాపము పారిపోనాయె
ఏ వేళ నీ దయచేత సత్కవులెల్ల
కావ్యములను సేయనాయె
మా వరునికి చెల్లెలని సంతోసమున
దేవి పెద్దలు బల్కనాయె
భావించి నీ పాదమున త్యాగరాజు
భావుకమనుకోనాయె త్రిపుర సుం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - suMdari ninnu varNiMpa brahmaadi ( telugu andhra )