కీర్తనలు త్యాగరాజు స్వరరాగసుధారసయుత భక్తి
శంకరాభరణము - ఆది
పల్లవి:
స్వరరాగసుధారసయుత భక్తి
స్వర్గాపవర్గముగా ఓ మనసా ॥స్వ॥
అను పల్లవి:
పరమానందమనే కమలముపై
బకభేకము చెలఁగేమి మనసా ॥స్వ॥
చరణము(లు):
మూలాధారజనాద మెఱుఁగుటే
ముదమగు మోక్షమురా
కోలాహల సప్తస్వర గృహముల
గుఱుతే మోక్షమురా ఓ మనసా ॥స్వ॥
మద్దలతాళగతులు తెలియకనె
మర్దించుట సుఖమా
శుద్ధమనసులేక భజనచేయుట
సూకరవృత్తిరా ఓ మనసా ॥స్వ॥
బహుజన్మములకుపైని జ్ఞానియై
బరగుట మోక్షమురా
సహజభక్తితో రాగజ్ఞాన
సహితుఁడు ముక్తుఁడురా ఓ మనసా ॥స్వ॥
రజత గిరీశుఁడు నగజకు దెల్పు స్వ
రార్ణవ మర్మములు
విజయముగల త్యాగరాజుఁడెఱుఁగే
విశ్వసించి దెలుసుకో మనసా ॥స్వ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - svararaagasudhaarasayuta bhakti ( telugu andhra )