కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
వేఁగి క్షేత్రము

5. వేఁగి క్షేత్రము

ఏ రాజు పంచెనో యిచట శౌర్యపుఁ బాయ సమ్ములు నాగుల చవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజ రమణులు కాళ్ళఁబారాణు లిడిరొ
చిత్రరథస్వామి శ్రీరథోత్సవములోఁ దెలుఁగుపిల్లలు కత్తి త్రిప్పిరెపుడో
ఏ రెండు జాముల యినుని వేడిమి వచ్చి కలసిపోయెనో త్రిలింగప్రభువుల
        నా జగచ్ఛ్రేయసంబులై యలరు తొంటి
        వేంగిరాజుల పాద పవిత్ర చిహ్న
        గర్భితమ్మైన యీ భూమిఖండమందు
        నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.
ఇఁట వేఁగీశుల పాదచిహ్నములు లేవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు, నెదో పూర్వాహ్ణ దుష్కాలపుం
ఘటికల్‌ గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు, నీ పల్లెచో
టఁట లోకాద్భుతదివ్యదర్శన మఁటే! యా భోగ మేలాటిదో!
నీ యతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయత ధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశ గో
పాయిత లాంధ్రపల్లవ నృపాలుర హుంకృతి వ్యాఘ్రగర్జగా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్యరసాకృతిం జనెన్‌.
ఈ నా పదార్పితక్షోణి నే రాజు ధర్మాసనంబునుండి స్మృత్యర్థ మనెనో
ఈ నా దృగావృతంబైన భూములలోన నే శౌర్యధనులు శిక్షింపఁబడిరో
ఈ నా శరీరమందివతళించినగాలి యెంత పౌరాతన్య మేచుకొనెనో
ఈ నా తనూపూర్ణమైన యాకాశమ్ము నే క్రతుధ్వనులు శబ్దించినవియొ
        అస్మదజ్ఞాత పూర్వదివ్యత్వ మొప్పు
        నీ పునీతావనీఖండ, మిచట నిలచి
        యస్వతంత్రత దొరలు నా యాంధ్రశక్తి
        నన్నుఁ గంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
వేఁగిరాజ్యపు పల్లెవీథులఁ జెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరువులు తెలిసి
ఎగురు గోడీబిళ్ళ సొగసులో రిపు శిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పు తెచ్చిననాఁడె శాత్రవ వ్యూహముల్‌ పగిలించు నొరపు గఱచి
కోఁతి కొమ్మచ్చిలోఁ గోటగోడల కెగఁ బ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
        తెనుఁగు లంతప్డె యవి నేర్చుకొనియ యుందు
        రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
        రస మొడిచి యుగ్గుపాలతో రంగరించి
        బొడ్డుకోయని కూనకే పోయుదురఁట.
శిలవోలెన్‌ గదలంగలేక హృదయస్నిగ్ధార్ద్ర సద్భావనా
ఖిల చైతన్యుఁడనై పురావిదిత వేంగీపూజ్య సామ్రాజ్యగా
థల యోజించుచు నాంధ్రపల్లవనరేంద్ర శ్రీయశస్స్తంభమున్‌
బలె నిల్చుంటిన యీ పవిత్రధరణీభాగంబునం దీ గతిన్‌.
ఏ దివ్యపురుషులీ శాద్వలాంకూర శేఖరమ్ముల లిఖించిరో! యి వెల్ల
ఈ వాయువీచిలో నే యప్సరస్సమాజము నింపిరో గీతిసముదయంబు
ఏ దివ్యశిల్పులీ రోదసీకుహరాన వ్రాసిరో దివ్యశిల్పంబు లిన్ని
ఈ పథాంతరమునందే పురాణమునీంద్ర సంతతులో ప్రశంసలు పొనర్త్రు
        ఎటఁగనినఁ బూర్వపల్లవ నృపచరితలె
        వ్రాయఁబడి పాడఁబడి గీయఁబడి యుపన్య
        సింపఁబడి శ్రోత్రపేయమై చెన్నుదాల్చె
        నీయతీంద్రియశక్తి నా కెట్టు లబ్బె!
ఈ పొలాలెంత చేవెక్కించుకొన్నవో గుండె వ్రయ్య సముద్రగుప్తుఁ డడలె
ఈ నేల పావిత్ర్యమెంత కుంభించెనో చిత్రరథస్వామి సేవలు కొనె
ఇట పల్లవుల రాచయెలనాగ లే వ్రతమ్ములు చేసిరో లచ్చి నిలుకడవడె
ఈ కాశ్యపీఖండ మే శరజ్జ్యోత్స్నలో పులకించెనో కీర్తి తెలుపులూరె
        ఇట నెచట త్రవ్వినను బంగరే నఁట, యది
        యెంత శ్రీయొ! యదెంత రాజ్యేందిరయొ! ప
        దానత నఖాగ్రపాత నిర్యన్నిధాన
        మైన యీ చోటనుపభోగ్యమయ్యె నేఁడు.
ఈ పొదలం జరించుచు నహీన మహామహిమానుభావమౌ
నే పురవీధులందొ చరియించుచు నుంటి నటంచుఁ బారతం
త్ర్యాపతితుండనయ్యును పురామహదాంధ్రమునన్‌ స్వతంత్రుఁడౌ
నే పురుషుండనో యనుచు నీ భ్రమ సత్యముగాఁ దలంచుచున్‌.
ఏ పల్లవనృపాలుఁ డెత్తినబావుటా చాళుక్యనృపుల రాజ్యంబునందు
ఏ దేశికవిత పాలించిన కవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు
ఏ యులిఁజెక్కు నేర్పేలు మహాశిల్పి గోదావరీనదీ ఘోషయందు
ఏ తొంటి తెలుఁగుల యెక్కువాచారమ్ము బలవన్నృపుల ప్రాభవమ్మునందు
        సమసిపోయెనో ఉన్మత్త సామజంబు
        కొలను జొఱఁబడి తమ్మితూడులను పెఱికి
        వైచుటె యెఱుంగుగాని తత్పద్మగర్భ
        కేసర విమిశ్ర మధురసాగ్రియత గలదె?
ఇమ్ముగఁ గాకుళమ్ము మొదలీ వఱకుంగల యాంధ్రపూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతర మేలొ చలించిపోవు నా
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్ని జ
న్మమ్ములుగాఁగ నీ తనువునన్‌ బ్రవహించునొ యాంధ్రరక్తముల్‌.
ఇది వినిపింతునంచు మదినెంచెద మిత్రులకున్‌, గళస్థ గా
ద్గదికము లోచనాంత బహుధాస్రుత బాష్పనదమ్ము స్పందనా
స్పద హృదయమ్ము నా పనికిఁ జాలక చేసెడు నన్ను నింతగా
నెద పదిలించుకొన్న దిది యెక్కడి పూర్వపు జన్మవాసనో!
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - vee.rgi xeetramu Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )