కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 136. ఆంధ్రవీథి
136. ఆంధ్రవీథి (వాయుసందేశమునుండి)
చుట్టు నున్నట్టి పర్వతాల్‌ పెట్టనట్టి
కోటగానొప్పు బొబ్బిలికోటదరిని
గాండ్రు గాండ్రని తీండ్రించు తాండ్రపాప
రాయు బొబ్బిలిపులి యని ప్రథితకీర్తి
గన్న వీరు దలచి మందగతిని బొమ్మ!
కళలకుం గవులకు హరికథకులకును
గాయకులకు పండితులకు గణికలకును
పుట్టిని ల్లదె! రణమున దిట్ట యయ్యు,
దొంగపోటున శత్రుచే భంగపడిన
విజయరాముని నగరంబు, నిజము జెప్ప
దాని కీ డగు పురము నెందేని గనవు!
చెంత జేరి సముద్రమ్ము చిందులాడ
ఇంపొసగు లతలతో సెలయేళ్ళతోడ
రమ్య మైయొప్పు సింహాచలమ్ముపైన
భక్తవరదు సింహాద్రియప్పని భజించి
యచటి ప్రకృతివిచిత్రమ్ము లరసి చనుమ!
పావనక్షేత్రముల కెల్ల పావనమ్ము
మీరి దక్షిణకాశియ\న్‌ పేర బరగు
పాదగయతీర్థమున గ్రుంకి భక్తితోడ
దగ్ధశవహవ్యధూపసంతర్పణమ్ము
కుక్కుటేశ్వరునకు జేసి మ్రొక్కి చనుమ!
పరమసాధ్వి పతివ్రత భర్తతోడ
సాగుమానము జేసిన సచ్చరిత్ర,
కాపుకోడలు కామమ్మ, కలియుగాన
బొందితోడ కైలాసము నందినట్టి
పుణ్యభూమి దర్శింపక పోకుమోయి,
కులము తీరెంచ నేటికి గుణము కల్గ!
కులుకులాడి, మాయావిని, క్రూరమదన
బాణహత, మారుతల్లి, త న్వలచి విఫల
యై నిజేశునితో కల్ల లాడి, తనదు
కాలుసేతులు నరకింప, నేల గూలి
నట్టి సారంగధరుమిట్ట యదియె! అచట
చల్లగా వీచుమా, నీదు జాలితెలియ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 136. AMdhravIthi - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )