కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 044. వీరుడు
44. వీరుడు
    వీరుడెవడురా
    శూరు డెవడురా!
ఘోరమైన యుద్ధభూమి
మాఱుమ్రోగు ఫిరంగీల
బారులకును వెఱవకుండ
    బోరు సైనికుండేనా?
ఉసురుల విసికించి జగతి
మసలకుండజేయు క్రూర
వ్యసనమ్ములతోడ బోరి
    వశము గొనినవాడు కాడొ?        వీరు...
    శక్తియెద్దిరా?
    వ్యక్తి యెద్దిరా?
కొండలన్ని పిండికొట్టి
మండు మహాగ్నుల జొరబడి
దండిశక్తి జూపి వెలుగు
    గండరగండ గుటేనా?
అన్నమాట నెగ్గింపగ
నెన్ని కట్టడిడుములైన
వెన్నుజూపకుండ కోరి
    కొన్న ధీరు డగుట కాదొ?        శక్తి...
    రక్తి యెద్దిరా?
    ముక్తి యెద్దిరా?
పాడుమబ్బు సంచులతో
కూడబెట్టి యనుభవింప
జూడలేక ప్రాణమైన
    వీడెడు దురవస్థ యేన?
మనసు గొన్న కన్నియకై
ధనము ప్రాణమైన నిచ్చి
ప్రణవపు నిర్వాణమ్మున
    తనివి గొనుట గాకనెద్ది?        రక్తి...
    వీరు డెవడురా!
    శూరుడెవడురా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 044. vIruDu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )