కవితలు చీకటి నీడలు - బైరాగి 01. దీపావళి
దీపావళి

దీపావళి ఉత్సవమండీ!
దీపావళి చేద్దాం రండీ!
ఆకాశం మండిద్దామా?
పాతాళం తగలేద్దామా?
దీపావళి చేద్దామా!

నరకాసురు డెందుకు? ప్రపంచ
నరకాన్నే మసిచేద్దామా?
కాటుకలా నల్లని చీకటి
జ్యోతుల బంధించిన వాకిటి
తలుపులు తగలేద్దామా?

తమ బ్రతుకుల ఆఖరుశ్వాసలు
వదలిన చల్లారిన ఆశల
మొగముపైన నల్లని దుప్పటి
కన్నుమిన్ను కానని చీకటి
రండోయ్‌! చితులు రగుల్చండీ!
చీకటి గుండెలు కలచండీ!
మంటల నాట్యపు మ్రోగేగజ్జలు
చిటపటకాలే శవాల సెజ్జెలు
రగిలిన చితిమంటల వాదం
పగిలిన యుగ ఘంటానాదం
అది చీకటి శవసంగీతం
ఉన్మత్తుని స్వేచ్ఛాగీతం
దీపావళి తెచ్చిందండీ!
దీపావళి చేద్దాం రండీ!
జీవితాన్ని కోరనివారూ
మీమీ కసి తీరనివారూ
వంచితులూ, భగ్నహృదయులూ
విషవధూ పరాజయ ప్రియులూ
కలలలోన బ్రతికినవారూ
అలభ్యాన్ని వెదకినవారూ
బ్రతుకురేయి పెనుచీకటిలో
బ్రహ్మాండపు నడివాకిటిలో
మిణుకుమనే జీవితదీపం
వెలుతురులో ముక్తిస్వరూపం
కొరకు వేచి కూలినవారలు
మృత్యునిద్ర తూలినవారలు
రండీ! నిద్దుర లేవండీ!
దీపావళి పిలిచిందండీ!
భూమ్యాకాశపు హద్దుల్లో
చీకటివెలుగుల ముద్దులలో
అవే రక్త జ్యోతులధారలు
నలుదిక్కుల ఎర్రటిచారలు
చుట్టుముట్టి కాలే గుడిశెలు
తెలతెల మీ మేడలవరుసలు
బ్యాంకులు, ప్రభుత్వ భవనాలూ
ధనదేవత కేళిగృహాలు
నాగరికత కట్టినకోటలు
మురుగునీట మునిగిన పేటలు
నెత్తుట తడిసిన ఐశ్వర్యం
కుళ్ళిన చివికిన సౌందర్యం
మంటల నాలుకలతో నాకే
ఆకలితీరక ఎగబ్రాకే
కరువుగొనినపులి దీపావళి
గడగడ వణకుతోంది భూతలి
కాగడాలు! లక్షలలక్షల కాగడాలు
మంటల పిల్లల ఆగడాలు
కాగడాలు భగ్గునమండీ
తరతరాల పాపం పండీ
నర్తించే అనలప్రవాహం
ఇది అభినవ లంకాదహనం
నెత్తురుటేరుల పాయలు అవి
బ్రతుకు సంజకెంజాయలు అవి
దీపకరాగపు కెంజడులై
ప్రపంచపద్మపు పుప్పొడులై
వెచ్చనిదిక్కుల విరిశాయి
పచ్చనిపైరుల ఒరిశాయి
జీవిత ప్రాంగణాన్ని కప్పిన
మృత్యువులా రెక్కలువిప్పిన
ఆ నల్లని చీకటి నీడలు
చూపుల చెరబట్టిన గోడలు
పగిలి నెగిలి పడిపోతున్నాయ్‌!
రాయిరాయి విడిపోతున్నాయ్‌!
పెనుచీకటి పొరలను చీల్చీ
జీవితపు కల్మషం కాల్చీ
గొడ్రాలౌ రేతిరి కడుపున
నెత్తుటి పిండంలా జారిన
దీపావళి పిలిచిందండీ
దీపావళి వచ్చిందండీ!
నైరాశ్యపు చీకటిముసుగున
దాగిన మృత్యువు నర్తించిన
పాడుబడిన బ్రతుకుల గుట్టల
రాతిగుండెల కండల చట్టుల
గణగణమని చావులగంటలు
చటచటమని పిలిచినమంటలు
సుకుమారులు మంటలకాలీ
బలహీనులు భయపడితూలీ
కాలేతనువుల వాసనలే
క్రమ్మినాయి నీరాజనమై
ఊపిరాడనీయని పొగలో
విషవాయువు కక్కినసెగలో
మంటలతో భాగంపంచీ
జవములేని నడుములువంచీ
జ్వాలాశేషాన్నం కొరకై
గతసంస్కృతి చిహ్నం కొరకై
వెదుకుతున్న కంకాళాలు
పశుమానవుల పటాలాలు
అంధమూఢ సంస్కారంతో
క్రూరదాస్య గురుభావంతో
జర్జరపురాణ జగతిరగిలి
విధ్వంస మహాదీపావళి
చీకటిలో చిరబంధితులూ
ఆకలిలో ఆక్రందితులూ
మీకోసం లేచినమంటలు
మీకోసం మ్రోగిన గంటలు
మీకోసం చిరపాపంతో
పీడిత దరిద్రశాపంతో
క్రుంగిన ధరిత్రి కడుపుపగిలి
వెలిగిన ప్రళయప్రదీపావళి
దీపావళి వచ్చిందండీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - diipaavaLi - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )