కవితలు దాశరథి కవితలు అగ్నిధార

తొలిపలుకు (తొలిముద్రణకు)
శ్రీ దేవులపల్లి రామానుజరావు

అగ్నిధార యను గ్రంథనామకరణము యీ ఖండకావ్యసంపుటి యొక్క ప్రత్యేకతను రచయిత వ్యక్తిత్వమును సూచించుచున్నది. గ్రంథకర్త శ్రీ దాశరథి తెలంగాణ యువకవులలో అగ్రగణ్యుడు. ఆయన హృదయమును కుమలపెట్టిన పొగలు, సెగలు పైకి ఉబికివచ్చి యీ గ్రంథములో అక్షర రూపము దాల్చినవి.

ఆధునిక యుగము తెలుగుసాహిత్యములో అభ్యుదయయుగమని చెప్పవచ్చును. భావకవిత ఇంచుమించుగా ఆధునిక తెలుగు సాహిత్యమునుండి నిష్క్రమించినది. గోదావరీనదీవాఃపూరముగాని, కృష్ణా తరంగపంక్తులుగాని అభ్యుదయకవిత్వములో గానుపించవు. ప్రేయసినిగూర్చిన ప్రేమగీతాలు ఆధునిక కవులను ఆకర్షించుటలేదు. గులాబిగుత్తులు, పన్నీటిజల్లులు, వలపుతలపులు, వెన్నెలవిహారాలు, తూగుటుయ్యాలలు నేటి కవితావీథులలో కానరావు. "ఏ జాతి చరిత్ర జూచినా, ఏమున్నది గర్వకారణం; నరజాతిచరిత్ర సమస్తం పరపీడనపరాయణత్వం" అని పలికిన శ్రీశ్రీ తెలుగు కవిత్వములో ఒక క్రొత్త మార్గము త్రొక్కినారు. ఈ సంప్రదాయము ననుసరించి కవిత్వమువ్రాయు యువకులలో శ్రీ దాశరథి ప్రముఖులు. ఆగర్భశ్రీనాథునికి అనాథునికి మధ్య చిరకాలము నుండి జరుగుచున్న సంఘర్షణయే మా దాశరథి కవితావస్తువు.

తెలుగు సాహిత్యములో ఇదియొక విప్లవాత్మకమగు మార్పు. ఈ మార్పునకు మన ఆర్థిక సాంఘిక పరిస్థితులే కారణ మని చెప్పవచ్చును. నేడు మనదేశములో ఆర్థికముగా ఒక గొప్ప విప్లవము జరుగుచున్నది. రాజరికము, పెట్టుబడిదారీ విధానములమీద ఒక పెద్దతిరుగుబాటు జరుగుచున్నది. సాహిత్యములో గూడ యిట్టి తిరుగుబాటే కనబడుచున్నది. ఈ తిరుగుబాటుకు దాశరథి కవిత్వము ఉత్కృష్ట నిదర్శనము.

తెలంగాణము నా జన్మభూమి యని దాశరథి గర్వించును. "నా తెలంగాణ కోటిరత్నాల వీణ" అని యున్నాడు. శ్రీ గురజాడ అప్పారావు "దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌" అని చెప్పినారు. అదేవిధముగా దాశరథి, తెలంగాణము రైతుదే అని ఢంకాకొట్టి వచించినారు. తెలంగాణ రైతు కష్టసుఖములే దాశరథి కవితాసామగ్రి.

దున్నినవానిదే భూమి యను సిద్ధాంతము యీనాడు సర్వదా అంగీకరింపబడుచున్నది. ఈ సిద్ధాంతమునే దాశరథి కవిత్వము కూడ ప్రతిపాదించుచున్నది. నిలువనీడలేని, నిస్వార్థనీచమానవుని అభ్యుదయమే దాశరథి కవిత్వమునకు ఆదర్శము, ప్రేరణ. సజ్జబువ్వకోసరమై లజ్జవిడిచి చిరిగిన చీరలతో ముజ్జగాలు తిరిగే పేదల ఎంగిలిమెతుకులు దొంగిలించి "బంగారం పొంగించిన ధనికులను మ్రింగాలని దొంగచాటుగా కాలము తొంగిచూచినది" అని దాశరథి హెచ్చరిక. "నీపిల్లలను ఇల్లాలిని కిల్లీమాదిరిగా నమిలే మిల్లుమ్యాగ్నేట్లు, నీ వేడినెత్తురులో షవర్‌బాత్‌ తీసుకునే భువనైక ప్రభువుల" ఆధిక్యతను ఉంచగూడదని దాశరథి కార్మికులను ప్రేరేపించుచున్నారు. కావుననే యీయన వ్రాతలు నరాలకు అగ్గినిపెట్టి, మెదడుకు ఉడుకు లెక్కించుచున్నవి. "పీడితప్రజావాణికి మైక్‌ అమర్చి అభయవాదులకున్‌ వినిపింపజేసెదన్‌" అని యీయన గొంతెత్తి పలుకుచున్నారు. బ్రతుకు విలువలు నశించి పాడువడిన యీ స్వార్థప్రపంచములో విప్లవాగ్నుల తుఫానును లేపు చున్నది నిజముగా యీయన కవిత్వము.

గత సంవత్సరము తెలంగాణమంతయును కుంపటిలోపడి నిప్పులలో మాడిపోయినదని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. ఆనాటి ప్రజలకష్టాలు దాశరథిని కాలరుద్రుని జేసెను. కావుననే "వ్రణాలకు, రణాలకు, మరణాలకు, మానప్రాణహరణాలకు, హద్దూపద్దూ వుండని కరకునృపతి రాజ్యములో చిరఖేదం విరమించుక బ్రతికేమో! కడుపునిండ గంజినీళ్ళు గతికేమో!" అని ఆయన దీర్ఘనిశ్వాసము విడిచినారు. నిజానికి ఆ దినాలు అట్టివి. ఆ గండమునుండి యెట్లు బ్రతికి బయటపడినామా యని కడు ఆశ్చర్యము కలుగుచున్నది. అన్నార్తులు, అనాథలు ఉండని నవయుగానికి, కరువులేని కాలమునకు ఎదురు చూచుచున్నాడు దాశరథి.

తెలంగాణలో జరిగిన ఆస్తులదోపిడులు, పడతులమానాల అపహరణము, ఊళ్ళకు ఊళ్ళు అగ్గిపెట్టి, తల్లిపిల్లల కడుపుకొట్టిన దుర్మార్గము మున్నగు సంఘటనలు దాశరథి హృదయములో నిప్పుకణికలను వెదజల్లినవి. తత్ఫలితముగా చెలరేగిన ధూమజ్వాలలు తెలంగాణ సమర సాహిత్యముగా పరిణమించినవి. జగత్తంతా రగుల్కొన్న క్రోధజ్వాల ఊరకపోదని, ఆ దుర్మార్గాలకు కారకులైన వారిని దాశరథి కవివాణి శపించినది.

నేడు తెలంగాణలో కవులెందరో యున్నారు. కాని పీడిత ప్రజల సమస్యలకు ప్రాధాన్యత యిచ్చి, గొంతెత్తి చెప్పగలిగిన కవివాణి దాశరథియే. జనసామాన్యము యొక్క హృదయాలలోని ఆకాంక్షలను గట్టిగా, శక్తివంతముగా వ్యక్తీకరించిన ఆంధ్రావని యువకుడు మరొక్కడు లేడని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. దౌర్జన్యము, అన్యాయము, అక్రమములు మీద తిరుగుబాటే ఒక మాటలో దాశరథి కవిత్వము.

దాశరథికి ఉజ్జ్వలమగు సారస్వత భవిష్యత్తు గలదు. భగవంతుడు ఆయనకు దీర్ఘాయురారోగ్యములు ప్రసాదించుగాక!

హైదరాబాదు,
15-8-1949.

AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - dASarathi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )