కవితలు దాశరథి కవితలు గాలిబ్‌ గీతాలు
వలపు వలన బ్రతుకు బహురుచ్యమైనది
ఎడద తీయదనము బడయసాగె;
బాధ కౌషధమ్ము బడసియు డెందంబు
మందులేని బాధ నందె మరల.
 
ఇంట నుండంగ ననుమతినిచ్చి తీవు;
చుట్టియుండిన నాసెజ్జ నట్టె విచ్చి
పరచితినొ లేదొ శయనించుకొరకు నేను,
అంతలో 'వద్దు వద్దు పొ' మ్మందువేమె!
101
ఆమె నూర్వశితో పోల్చినంత, సుంత
కోపగింపక తా నూరకొనెను గాని
కినుకబూనిన నాతప్పె యనును జగము,
ఆమె యెక్కడ! ఊర్వశి యనగ నేడ?
102
నా యెడద చీల్చి రక్తమండలము సేసె,
నేను వేదనతో మరణించినాను,
ఇపుడు గోళ్లకు నెరుపురం గెట్టు లెక్కు
వెలది తాను గోరంటాకు పెట్టకున్న?
103
నాకొఱకు నీవు వత్తువన్నయది నిజము,
జాగుసేయవటన్నది సత్యమగును,
అసలు నా వార్త నీ కందునంతలోన
మట్టిలో నేను కలిసెడి మాట నిజము.
104
కాలమే నాకు తగు నవకాశ మిడిన
చేసిచూపుదు నెన్నొన్నొ చిత్రములను,
మనసులో గల ఒక్కొక్క మచ్చ నాది
బీజమగును దివ్యదీపికావృక్షమునకు.
105
పొలతినయనపక్ష్మములను వలచితినని
కోపమున జనుల్‌ వ్రేలెత్తి చూపినారు,
వారి ప్రతివ్రేలు బాణమై వచ్చి తాకి
అంతరాంతరములయందు వ్యథనుకూర్చు.
106
మాటిమాటికి గిన్నెల మధువు పోసి
మధువునే బాధపెట్టెడి విధ మదేల?
దేవి! మధుపూర్ణభాండమే తెచ్చి నాదు
నోటి కందీయరాదె, సంతోషపడెద.
107
స్వర్గమున తేనె ధారల బడయగోరి
వసుధపై సురాపానము వదలె దేల?
ఈగ లెన్నెన్నియో ఎంగిలించినట్టి
తేనె గా దిది, దివ్యమాధ్వీకమోయి!
108
వలపువలన నీవు వలవల నేడ్చిన
నా శిరమ్ము ఛేదనమ్మునందె,
ఖడ్గధార పదనుగలిగినట్లుగ నశ్రు
ధారవలన పదనువారె కనులు.
109
స్వప్నమందు తాను వచ్చి న న్నోదార్చి
శాంతపరచెనేని చాలు నాకు,
కాని దుఃఖవహ్ని కాసంత నిద్దుర
పట్టనీదు, స్వప్న మెట్టు లబ్బు?
110
నిన్ను ప్రేమించు టాటనుకొన్న దేమొ
నా యెడద, ఇప్పు డిటు వలపోయదొడగె,
ఇట్లు వలవంతపా లొనరించినట్టి
యెడద నేరీతి శిక్షింపదొడగవలయు?
111
ధనము మూల్గుచుండె ధరణిపై నిండుగా
దానవీరు డెవడు తనరబోక,
పానశాలలోన పాత్రలు మధువుతో
తొణకుచుండె త్రావు మనిషి లేక.
112
నీవు ప్రేమతో వచ్చుట పూవుతోట
కెంతయో సంతసమ్ము కల్గించె ననగ
చేయిసాచి నిన్‌ కౌగిట చేర్చగోరి
మొగ్గలన్నియు వికసించ మొదలుపెట్టె.
113
వ్రాయ నేమి లేకపోయియు నీ పేరు
చేర్చి వ్రాతు నొక్క చిన్ని లేఖ,
నీదు పేరు వలచి నిలచియున్నాడను
కాంక్షలూరు వలపుకాడ నేను.
114
వీణతీగ తాకెదేని జుంజుమ్మని
రాగములు పరంపరలుగ వెడలు,
అట్లె నను కదల్చినట్లైన నీపైన
నెన్నొ నేరములను విన్నవింతు.
115
తరుణిచేతి అంబు తగులునట్లుగ నిల్చి
గాయపడగ కోర్కి కలదు నాకు;
అంబు తగుల కేగ, అద్దాని కొనితెచ్చి
తరుణి కిత్తు మరల తాను వేయ.
116
కాళ్ళు బొబ్బలెత్తి కడు మెల్లగా సాగు
బాటసారివోలె పరగినట్టి
తారకాగణమ్ము త్వరగా చరింపదు
ప్రణయదీర్ఘ మార్గవర్తి యగుచు.
117
నే నొసంగిన లేఖ సందేశహరుడు
తీసికొనిపోయి ఆమె కందిచ్చుకన్న
ముందె నే నామెయింటికి పోయినాడ!
మెచ్చుకొనుడు మీరెల్ల నా పిచ్చి నిపుడు.
118
అందకత్తెల సాహచర్యమ్మునందు
కొద్దినాళులు గడపినగూడ చాలు,
ఘోరనిస్సార సంసార కుండమందు
ఎన్నొ యుగములు జీవించు టేమిమేలు!
119
పిచ్చివాడ నేను, చచ్చిపోయిన గూడ
నా సమాధిమీద దోస మనక
పిల్లవాండ్రు విసరివేసినా రెన్నెన్నొ
బండరాళ్లు పూల చండులట్లు.
120
శివుని వెదుకబోతి, చిక్కలే దాతడు,
వట్టిచేతు లూని వత్తునేని
జనులు నవ్వగలరుగనుక నే రా నింక,
తిరిగిరాక యెటకొ అరుగగలను.
121
వనిత! నీవు భువిని వర్తిల్లుచుండగా
ఇంక నాకలోక మేల నాకు?
పోకతప్పదేని నాకలోకానకు,
నీవుగూడ వేగ రావలయును.
122
నన్ను హత్యజేసి నా సమాధిని నీదు
వీధిగట్టబోకు ప్రియ లతాంగి!
నా సమాధిబట్టి నలుగురు నీ యిల్లు
తెలిసికొనుట నోర్వగలనె నేను?
123
నాకు నీదు దర్శనమ్మైన యంతనే
మత్తుక్రమ్మి చూడ మరచినాను,
కానబడియుగూడ కనరాకపోతివి,
నాదు చూపుచెదరె నాల్గుదెసల.
124
నేను 'మజ్ను' వట్లు నీకు నా ప్రణయమ్ము
బయలుపరచజాలువాడ, కాని
గుండెలోన డాగి మండించు నా బాధ
వ్యవధి నిడదు ప్రేమ బయలుపరుప.
125
రెక్క లూడిపోయె భృంగమ్మునకు నేడు
విశ్రమించుకొరకు వేళచిక్కె,
ఇంక పూలగూర్చి ఏమాత్రమైనను
కోర్కి గలుగు వీలుగూడ లేదు.
126
ఆకురాలు కాల మైననేమి? వసంత
మరుగుదెంచినంత నొరుగునేమి?
నాదు చిన్నగూడు, నా జీవితపు గోడు
నా విషాదగాథ నాదె కాదె!
127
ఆమె పల్లకిలో నెక్కి అరిగె నాదు
వీధివెంబడి పడి కడు వేగమునను,
పల్లకిని మోయు బోయీలు బరువువలన
బుజము మార్చగా గోర నొప్పుకొనకుండ.
128
మనసులోని రహస్యాలు మరుగుపరుప
నోరు మెదుపక కూర్చుండనోపుగాని,
నేను మాట్లాడియును దాచినాను వాని,
ఎవ్వరును వాని అర్థాల నెరుగ లేరు.
129
చల్లచల్లని పూర్ణిమాశర్వరులను
ఎంత మధువు లభించిన నంతగ్రోల,
శ్లేష్మతత్వమ్ము గల్గు శరీరమందు
వెచ్చదనము మరింతగా వచ్చుగాదె!
130
మన రహస్య మొరులు కనినంతనే యెంతొ
సిగ్గుజెంది ఆలసించ కేగి
మట్టిలోన డాగినట్టి నీ అభిమాన
మగు ననన్యసాధ్య మమృతవాణి!
131
వెలుగుచున్న దివ్వె మలిపివేసినయంత
కానుపించు నల్లనైన మచ్చ,
అట్లె పూర్తికాని అభిలాషముల మచ్చ
గుండెలోన కూరుచుండె నాకు.
132
గాలిబా! ఆమెతో చెప్పగలము నీదు
వ్యథనుగూరిచి, నీగుండెవంతగూర్చి,
కాని అంతమాత్రమున తా కనికరించి
చేరవచ్చు నటన్నది చెప్పలేము.
133
ఆదిమానవు డమరాలయమ్ము విడిచి
వెడలిపోయిన గాథలు వింటిగాని
ఎంతొ అవమానమంది నీ యింటినుండి
ఎడద దురపిల్లగా నేనె ఏగుచుంటి.
134
కోపమనెడు కత్తి కున్న పదను జూచి
మురిసిపోయె దేల, ముదిత! నీవు?
నా విషాద మనెడు నదిలోన నొక చిన్ని
నెత్రుతరగవోలె నెగడు నద్ది.
135
సఖిసమాగమ వాంఛయు, సఖివియోగ
బాధయు మదీయహృదయాన ప్రజ్వరిల్లు,
నాతితో నాదు వాంఛయు, నాదు బాధ
చెప్పుకొనగల్గు రోజు వచ్చినను చాలు!
136
పాడువడినయింట పచ్చిక మొలిచెను
వచ్చె నవవసంతవాసరమ్ము,
ఇంక శైశిరమ్మె యేతెంచినప్పుడు
ఇంటి అందచంద మెట్టులుండు?
137
ఆమె తన గర్వమును వీడనపుడు నేను
ఆత్మగౌరవ మేల పోనాడవలయు?
నేను తలవంచి, నమ్రత బూని, పోయి
"అంత తలబిరు సే"లని అడుగుటేల?
138
కఠినశిలవంటి హృదయము గలుగుదాన!
తల పగులగొట్టుకొనుటయే వలపులైన,
నీ గృహద్వారబంధసన్నిష్ఠశిలనె
తల పగులగొట్టికొనియెడి తలపు లేల?
139
వల తగిలియున్న నాకు నాఇలునుగూర్చి
చెప్ప వెరచెద వేలనే చిన్నపక్షి!
వనములో నిన్న పడిన ప్రభంజనమ్ము
నా కులాయముపై పడె ననుట యెట్లు?
140
ఆమె తననుగూర్చి అతిగర్వపడుచుండు
కాన పిలువబోదు తాను నన్ను,
నేను స్వాభిమాననిరతుడ గావున
పిలువకుండ పోను; కలియు టెట్లు?
141
ప్రణయినీ ముఖప్రభారసమును గ్రోలి
పడిరి మత్తుజెంది పానపరులు,
మధుగృహమ్ములోన మత్తు కల్గించెడి
దేమి లేదు మచ్చుకేనికూడ.
142
కాలమేల నన్ను కడునిర్దయత్వాన
చెరిపివేయు, భక్తవరద! నేడు?
పుడమిపలకమీద పొడమిన అధికాక్ష
రమును గాను నేను రాచివేయ.
143
అద్దమందు నిన్నె అవలోకనముసేసి
ఈర్ష్య చెందుచుంటి వేమె, సుదతి!
నిన్ను వంటి అంద మున్న వా రింకొక
రుండిరేని యెంత మండిపడెదొ?
144
దివ్వె వెలుగగోరుదురు రాత్రి జనులెల్ల,
దానియంతట నదె దగ్ధమైన నేమి
సేయజాలుదు? రట్లె నా చింత నన్నె
చంపగా మిత్రు లేమి గావింపగలరు?
145
వెలది! స్వర్గము నీగృహవీధివోలె
అందచందాలతో నుండు ననుట నిజము
కాని నీవీధిలోపల కానుపించు
నంతమంది స్వర్గమ్ములోనైన లేరు.
146
త్రోవబోయెడి నూత్న పాంథుడను నేను,
పరుగులిడు ప్రతివానితో నురుకజూతు-
మార్గదర్శకు డెవ్వడో, మార్గ మేదొ
యెరుగగాలేదు నే నింతవరకుగూడ.
147
అదిగొ! ఆమెగూడ అనసాగినది నన్ను
'సిగ్గువిడిచె' నంచు, 'చెనటి' యనుచు;
ఇద్ది తెలిసియున్న ఇంతగా నాయిల్లు
గుల్లగుల్ల చేసికొనకపోదు.
148
ఉదర మేడిపించు, హృదయమ్ము నొప్పించు
నెంతకని రుదింతు, నేమిసేతు?
వీలుపడినయెడల వెలయిచ్చి పిలిపించి
ఏడ్చువారల నియమించదలతు.
149
తరలి సందేశహారి ఉత్తరము తెచ్చు
వరకు వేరొక లేఖను వ్రాసియుంతు,
ఏలయన, నాకు తెలియును బాల యెట్టి
పాటి ప్రత్యుత్తరమ్మును పంపగలదొ.
150
ఆమె ఉంగరాల అలకలు వలపన్ని
నన్ను ఉచ్చు పెట్టనున్నవోయి!
దైవమా! మదీయజీవితస్వాతంత్ర్య
వైభవమ్ము భంగపడగనీకు.
151
వానచినుకుల మ్రింగగా వాగులోని
ప్రతితరంగము మొసలియై వాయి విచ్చె,
శుక్తిలో జేరి చినుకులు మౌక్తికమ్ము
లగుట కెన్నొ యాటంకము లావహించు.
152
వలను పన్నువాండ్రపై వలపూనితి
కనుక ఎగిరిపోవగలిగిగూడ
వలను చిక్కినాను, బంధింపబడినాను,
బందివోలె నెంతొ కుందినాను.
153
'వలపుపిచ్చి' యనెడు పానశాలావిశా
లతనుగూర్చి ప్రశ్న లడుగబోకు,
దానితోడ పోల్చ ధారాధరపథంబు
చెత్త పారవైచు చిన్నిబుట్ట.
154
నా డెపుడొ పోయినట్టి ధనమ్ము తలచి
గర్వమును చెందెడు దరిద్రు కరణిగానె
నాడె మానిన ప్రణయవ్రణములపూర్వ
రక్తిలత్వమ్ము నెంచి గర్వపడువాడ.
155
ఎన్ని విధముల సౌఖ్యము లున్నగూడ
వలపువెఱ్ఱిని తగ్గింపగలుగవయ్యె,
పానపాత్రకై గల నీలవర్ణ మణులు
చిరుతపులిమచ్చలట్లు భీకరములయ్యె.
156
సాంధ్యకాలరక్తారుణచ్ఛటల గాంచ
నీ వియోగాన కుమిలి చింతించు నాకు
పూలతోటలసైతము ముమ్మరముగ
వహ్ని కురియుట జ్ఞప్తికివచ్చె సుదతి!
157
ప్రణయినీ రాగరంజితపదయుగమ్ము
ముద్దుగొను కోర్కి తీరకపోయెగనుక
ప్రియు సమాధిసమీప ధరిత్రినిండ
చిక్కచిక్కగా మైదాకుచెట్లు పెరిగె.
158
నాకమందు నరకలోకమ్ము కలుపుకో
వలవ దేలనోయి, భక్తపాల!
వాంఛ కలిగినపుడు వాహ్యాళి సేయగా
మరియు కొంతచోటు పెరుగుగాదె!
159
బాధితులకు న్యాయము కూర్చ, బాధకులకు
శిక్షనిడుటకు శాసనరక్ష కలదు,
కాని కత్తిని పట్టకే కనులతోనె
హత్యయొనరించుదాని కేఅడ్డు లేదు.
160
AndhraBharati AMdhra bhArati - dAsharathi - gAlib gItAlu - dASarathi ( telugu andhra )