కవితలు దాశరథి కవితలు గాలిబ్‌ గీతాలు
లాగివిడిచిన బాణంబులాగు నడచు
పడతియెదలోన స్థాన మేర్పరచుకొనుము.
 
మునుపు పూదోటలన్నచో మురిసిపోతి,
పూలవాసన కూపిరిపోవు నేడు.
161
దరులు నదినీరు గోరినకరణి, సాకి!
ఎంత త్రాగింతు, వంత వాంఛింతు మధువు.
162
ఆమె రానుండె నను వార్త అందె నిపుడె,
నాకు నే డింట చాపైన లేకపోయె.
163
హృదయ మపహరించి కదిలిపోయిన దామె
ప్రణయరీతి ఇట్టిపాటిదేమొ!
164
హింస భరియించు శక్తి నార్జించె మనసు,
ఇంక నా క్రూరురాలి వరింతు నేను.
165
రెక్కలను సాచి ఈ కోన నక్కియుంటి,
నెంతబాగు పంజరపున్‌ తల్పు లిపుడు విడిన!
166
వెళ్ళువరకె ద్వారము విచ్చిపెట్టరాదు,
పిలువగనె ఆమె తలుపులు విచ్చవలయు.
167
ఎడదమచ్చయె బాగున్న దింతవరకు,
ఇపుడు వ్రణమె మచ్చను మించి హృద్యమయ్యె.
168
ఈ వపాంగబాణములు వర్జించి తెపుడు?
వలపుబాకును మొలనుండి దులిపి తెపుడు?
169
దారి తెలియని ఈ మార్గదర్శి మనకు
దొరికినా డింక మన కేమి కొరత లేదు!
170
మృత్యు వే తెంచినపు డామెలేఖ వచ్చె,
చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.
171
ఎవరు గాలిబుతో కలహింపవలదు,
యోగి యాతడు లోలోన, రాగి పైన.
172
దుఃఖవిషము నా ప్రాణాలు తోడివేసె,
నీవు నను చంపితి వటంచు నింద యేల?
173
విరహమే నా బ్రతుకు భంగపరచినపుడు,
మరల త్రాగిన వచ్చెడి కొరత యేమి!
174
పడవనెక్కింపవచ్చినవా రెరుగరు
పడవలో నాకు కలిగిన బాధలెల్ల.
175
ఒంటిగా కాశి కేగలేనోయి, గురువ!
యాత్రికులవెంట కష్టాల ననుభవింతు.
176
'సాకి' కనులు లేవు, చషకధ్వనులు లేవు,
గోష్ఠి దిరిగె గగనగోళమెల్ల.
177
వేదనమ్మువలన చేదైన నాల్కకు
ఆమెతీపిముద్దు లందుగాక!
178
వదలిపోయిన సఖులకై వంతవలన
గుండెనెల్ల సదా దుమ్ముకొట్టుకొనును.
179
తీరబోవని కోర్కెల భార మిట్లు
మోతు, నేయభాగ్యుని మోముగీతనేమొ?
180
ఊహలో నున్న దానికై ఉబ్బిపోదు,
మధువు నూహించి పాడెడి మధుపమట్లు.
181
ఆర్ద్రతాబంధురంబైన అలరుతోట
అలరులే రాతిగోడలై అవతరించె.
182
వేటగాని వలన్‌ జిక్కె పిట్ట యొకటి,
వలయె దానికి తన గూటిభాతి తోచె.
183
ఆమె ఒరులింట దివ్వెయై అలరినంత
శోకగృహదీపమై నేను స్రుక్కినాను.
184
పూలు ముక్కోపినరుల ముఖాలవోలె
ఎఱ్ఱబడిపోవు, నంతలో కఱ్ఱియగును.
185
ప్రతియొకం డేదియో కోరువాడెగాన
వేటగాని నిందించుట వెఱ్ఱిగాదె!
186
గాజునే కోయు మద్యముకరణిగానె
గుండెనే కోయు వేదన కూడె నాకు.
187
నాశమే విశ్వమునకు పునాదియగును,
కాని వలపునకు సమగ్రత పునాది.
188
నాల్గు నిశ్వాసములు వీడి నీల్గునట్టి
నరుని అతిశయమును చూచి నవ్వె పువ్వు.
189
కాంక్షలన్నియు మృగతృష్ణికాతరంగ
ము లగుగావున యేల నిష్ఫలత కేడ్పు?
190
హృదయదీపమ్ము మలిగిపోయినదిగాన
పొగ వినీలాంబరము కట్టి పొగులజొచ్చె.
191
పికము శిశిరు నెంచె వసంతవేళలందు
కాన ప్రతిపువ్వు జ్వాలయై కాల్చదొడగె.
192
గుండియ వియోగవహ్నితో మండిపోయె,
కాని సంయోగవాంఛను మానలేదు.
193
ఓయి దుఃఖనిశ్వాసమా! ఈ యెడంద
కన్న చిక్కుసమస్య లోకమున లేదు.
194
వెతల మైదానమున వేరు గతియె లేదు
బాష్పవారిధారాసిక్త పథముగాక.
195
వెతల కుందెడువాడు నవ్వినవిధాన
పైన సంతోషమును, లోన బాధ నాకు.
196
ఖైదులో గూడుకట్టెడి ఖగము నేను
ప్రణయరంగాన సఫలత బడయు టెట్లు?
197
మృతినెరుంగని ఒంటి దేవతలకన్న
నలుగురికి మేలుచేసెడి నరుడె మిన్న.
198
ఆమె కనులకు రక్తదాహమ్ము కలదు,
నా కనుల నుండె రక్తాశ్రు శీకరములు.
199
నన్ను కవ్వించబోకు, నా కన్నులందు
అశ్రుఝంఝామరుత్‌ సమూహములు కలవు.
200
AndhraBharati AMdhra bhArati - dAsharathi - gAlib gItAlu - dASarathi ( telugu andhra )