కవితలు దాశరథి కవితలు గాలిబ్‌ గీతాలు
ఊహల పథాల పడిపోవుచున్న నాకు
మరలివచ్చెడి కోరిక మాయుగాక.
301
హృదయరాహస్య మితరుల కెట్లు తెలియు
నేను ప్రణయగీతములు రచింపకున్న?
302
నడుము బిగియించుచుంటివి నన్ను తునుమ,
నాకు తెలియులే నీ కెంత నడుము కలదొ?
303
దేవి! మనపూర్వ బంధమ్ము త్రెంచబోకు,
ప్రేమ లేకున్న నుండనీ ద్వేషమేని.
304
గోష్ఠి కే నేగుదెంచుట కోపమేని
కలసికొందము లెమ్మి ఏకాంతముగనె.
305
మెరుపువోలె బ్రతుకు పరువెత్తుచున్నను
వ్యవధి గలిగె ప్రియుని హత్యసేయ!
306
ఆమెకనులు నిశ్శబ్దమ్ములయ్యు పలుకు,
పలుకు టగ్గిని పొగయె కజ్జలముకాగ.
307
త్రవ్విత్రవ్వి అడుగదలచకు నాబాధ,
అగ్గి నీకుగూడ అంటగలదు.
308
జగతియంత ఊహాజాలముగనె తోచు,
కనుక నా జాలమున చిక్కుకొనకు మోయి!
309
వానరాత్రి నిన్ను వదలి యెట్టుల పుత్తు?
లెక్కబెట్ట నొక్క చుక్క లేదు.
310
ఉన్న హృదయ మొకటి - నిన్ను చూడని బాధ,
నిన్ను వినని బాధ యెన్న రెండు.
311
పాడుబడిన ఇల్లు బాగుసేయగ లేను,
చెడినదాని నేమి చెరతు వింక.
312
అలిగితిని నీపయిన్‌ ప్రియురాల! నేను
అదియు నా వెర్రిలో నొక అంగమగును.
313
మొరబెట్టుకొన్నచో మరి బాధ హెచ్చునని
ఎరిగియుండిన నేను మొరబెట్టుకొనకుందు.
314
గగన మనెడు 'సాకి' కడ సౌఖ్యమధు వేది?
బోరగిలిన గిన్నెవోలె నుండె.
315
మబ్బులున్న రేల మరి వెన్నెలల రేల
త్రాగ విడిచిగూడ త్రాగుచుందు.
316
దుర్గమమ్ము పథము, దొంగల్‌ ప్రయాణికుల్‌,
ఇంక ఒంటిబోవుటే నయమ్ము.
317
అడుగులొత్తు మటంచు పడతి కోరినయంత
కడుసంతసమున నా కాల్జేతు లాడవు.
318
నావలెనె దుర్దినములున్న నరుడొకండు
రేయినే పగలనుకొన్న పోయెనేమి?
319
ప్రణయపరితప్తుడను, పిచ్చివాడ గాను;
విరహవేదనలో శాంతి దొరకు నెట్లు?
320
అన్ని వేదనలకు నౌషధం బుండగా
ప్రేమబాధకే లభింప దేల?
321
త్రావి రాత్రివేళ తరుణి రావలెగాని
వెంట అన్యు డెవడొ ఉండ తగదు.
322
నేను లేకపోవ నిలిచిపోవున దేమి?
ఏల నన్ను కూర్చి జాలిపడుట?
323
ఎన్నొ అందాలు మట్టిలో నిగిరిపోయె;
కొన్నిమాత్రము పూలయి కన్నువిచ్చె.
324
లోకమందు సుఖము, శోకమ్ము కల వండ్రు,
శోకమొకడె ఇచ్చె నాకు బ్రహ్మ.
325
గాయపడిన నాగుండెను కాంతురేల?
తరుణికరమునకే దిష్టి తగులునట్లు.
326
ఆమె మాయింటి కెట్టులో అరుగుదెంచె,
దైవకృత మగు నిద్ది, సాధారణమ్మె?
327
పరుని తీపిమాటలకు లోబడెనుగాని
నోరులేని న న్నాయమ చేరనీదు.
328
"నాకముననేని నిన్ను పొందగల" నంటి,
"అచ్చరను కాను లెమ్ము నే" ననియె నామె.
329
ఎంతకాల ముంటినొ ఇల నేమి చెప్ప
విరహరాత్రులగూడ కల్పితినయేమి?
330
కలను కానుపించి పలికె "వత్తు" నటంచు
బ్రతు కదెల్ల నిద్ర పట్టలేదు.
331
చచ్చిపోవుట యేమి దుష్కరము కాదు;
సఖిరహస్యము తెలియు నన్‌ జంకుతప్ప.
332
ఆశతో బ్రతుకుదు రని అనుటె తప్ప
నాకు బ్రతికెడి ఆశయే లేకపోయె.
333
మూతిలేనికతన ముద్దొసంగకుగాని
నాల్క లేదె నీకు నన్ను తిట్ట?
334
నన్ను వలచినంత ని న్నొరుల్‌ నిందింత్రు;
మంచివారి చెడుగ నెంచు జగము.
335
భావమందు వలపువన్నియ లిపు డేవి?
వలపులాడి ఒకతివలన వచ్చె.
336
వలపుజూదపుటింటిని వదలుకొంటి,
అచట ఒడ్డుటకై ధన మసలె లేదు.
337
నవవసంతశోభ ననుభవింపగనీవు,
మధువులేని గిన్నె, వ్యథితమనసు.
338
ఊర్పులు ఫలించుటకు నొక యుగము వలయు,
ఇంతి! నినుపొందుదాక జీవించు నెవడు?
339
నీవు కురులు సింగారించినావుగాని
దాని పరిణామ మూహించినాను నేను.
340
నీదు కుడ్యము గనినంతనే స్ఫురించు
పిచ్చి 'గాలిబు' తల ఇట వ్రీలె ననుచు.
341
కవితతోగూడ నేను విక్రయమగుదును
సారమెరిగి క్రయించెడివారికొరకు.
342
నేను నీ వాకిటనె కట్టినాను గృహము
ఇంకనైన నాయిల్లెటో యెరుగలేవె?
343
పలుకలేని దౌర్బల్యమ్ము కలిగె నాకు,
"పలుకకయె బాధ తెలియు టెట్టు?" లను నామె.
344
క్రూరురాలని జగతిలో పేరుబడిన
దానితో నాకు పనిబడె దైవవశత.
345
విగ్రహముపూజసేత తప్పె యగుగాక,
విధిగ పూజింతు నా ప్రేమవిగ్రహమ్ము.
346
గోడ అడ్డముంచుకొని దాగియుంటివే?
ఎగసివచ్చు శక్తి నిచ్చె గోడ.
347
ఉచితముగ సేతు కజ్జలరచన నేను
క్రయికు నయనాల నా ఉపకార మడర.
348
ఎట్టి అధికుడ నే, నెట్టి దిట్టనోయి?
విధి అకారణముగ శత్రువృత్తిబూనె.
349
వెడలుచుంటి నిరాశను వెంటగొనుచు,
మలిగినట్టి దివ్వెను, సభన్‌ నిలువ తగను.
350
ఉత్తరీయాంచలము తడి నొందలేదు,
నీరు తగ్గి పాపస్రవంతికయె ఇంకె.
351
నీవు రాగోరితివిగాని నిన్ను పోవ
నీక బంధించు ప్రత్యర్థి లేకపోడు.
352
తరుణిచేత చంపబడంగ తగను నేను,
చచ్చుటకు వేరె మార్గ మెంచదగు నాకు.
353
ఎన్నియొ విచారములు నాకు నున్ననేమి?
నిన్ను మరువగాజాల నే నెన్నడేని.
354
వార్త తెచ్చినవానిని వధ యొనర్ప,
కద్ది నా తప్పు, వాని నే మనగవద్దు.
355
చెలియ అద్దాన మో మెంచి చిన్నబోయె,
ఒరుల కెదనీని గర్వమ్ము తరగిపోయె.
356
"చెడితి నీచేత" నని నిందసేయబోవ,
అందు నా అదృష్టము కొంత అలరుకతన.
357
మెరపొకటి వచ్చి కనులలో మెరసిపోయె,
దానితో కొంత మాట్లాడ దప్పిగొంటి.
358
హంత! నను చంపరాలేదు చెంత కేల?
నీదు పొదిలోన బాణము లేదె, చెపుమ?
359
వెలది చూపుతూపులను తప్పించుకొనగ
జూచె హృదయము, తుదకు గ్రుచ్చుకొని చచ్చె.
360
దుఃఖితుడ నేను, నా తల దునుమకున్న
వ్రాలియుండును మోకాళ్లపైన నెపుడు.
361
ఎంత తీయని పెదవులే ఇంతి! నీవి?
తిట్టుచున్నప్పుడునుగూడ తీపికురియు.
362
అపుడు గోష్ఠిలోనుండి న న్నవల త్రోసి,
రిపుడు చచ్చితి, న న్నెవ్వ డెత్తివైచు?
363
పగిలెనేని తెమ్ము పాత్ర యొం, డిదె మేలు
మణికలశముకన్న మట్టిచిప్ప.
364
బ్రతుకు పరువెత్తుచుండె గుఱ్ఱమ్మువోలె;
చేత కళ్లెమ్ము లేదు, కా లూతగొనదు.
365
నాశమందుకూడ నవసౌఖ్య మున్నది,
నఖము కత్తిరింప సుఖము కలుగు.
366
లేనియప్పుడు దేవుడ లెమ్ము నేను,
ఉన్నయప్పుడు నరుడనై యుంటి నౌర!
367
నాకమును పారవేయుడీ నరకమందు,
అమృతమునకయి యెవ డింక ఆశపడడు?
368
ఏమి వచియింతు దౌర్భాగ్య మింతకన్న
చచ్చిపోవుద మన్నను చావు రాదు.
369
బారెడంత వస్త్రంపు దౌర్భాగ్య మౌర!
విరహి తొడగిన అంగియై వెలయవలసె.
370
మలిగిన ప్రదీపమున పొగ మలసినట్లు
ప్రేమ నీలిబట్టలను నా పిదప కట్టె.
371
వెతల పోద్రోలు మం దేది మృతియెగాక?
ఉదయ మగుదాక దివ్వె వెల్గొందవలయు.
372
చెదరి ఎవనిపై పడునొ నీ చికురరాశి,
అతనిదె అదృష్ట, మతనిదే హాయిసుమ్మి!
373
'గాలి బెవ్వ'డంచు కాంత ప్రశ్నించిన
నేమి ఉత్తరమ్ము నీయవలయు?
374
వీణమెట్టు గాను, విరుల నవ్వును గాను,
నా పరాజయప్రణాద మేను.
375
బాల్యమున నేను 'మజ్ను'పై ప్రస్తరమ్ము
విసరబోవగ నా తల వెస స్ఫురించె.
376
ఇంకొకని నెట్టులేని ప్రేమించినావు,
పాపమునకు ప్రతిఫలమ్ము బడసి తీవు.
377
స్వర్గమును గూర్చిన ప్రశంస చాల వింటి,
కాని అది నీ నివాస మౌగాక, చెలియ!
378
హృదయ మెవరికొ యిచ్చి దుఃఖింపనేల?
ఎద నెడద లేక నాలుక యేల నోట?
379
ఏయలంకరణములేని సేయకగూడ
ప్రియుల మోహపరతు వేమె! నీవు?
380
ఆ యెడారిని 'మజ్ను'గా కరుగ రెవరు,
సంకుచితు చూపువలె అది చాల ఇరుకు.
381
చెలి కరమ్ముల తెగు వ్రాత కలదు నాకు,
కాన ప్రతి కత్తికడ వంచినాను తలను.
382
చెలియతో నాకు కలయిక కలుగుననుట
శత్రుభావమ్మె యగు నోయి మిత్రులార!
383
కంట నశ్రుధార కార్చుచుండుము నీవు,
ఇంకగూడ ఢిల్లి ఎంతొ దవ్వు.
384
ఆరటమ్మున మనసు వ్రయ్యలొనరిచితి,
చూడ కద్దముపైన గూర్చుండినట్లు.
385
అంధకారమై దౌర్భాగ్య మావరించె,
ఇంక తెలిరేక యొకటి నీక్షించనైతి.
386
నన్నె కాల్చు నీ నిశ్వసనముల వహ్ని
ప్రక్కయింటిపై పడబోవ దొక్క రవ్వ.
387
అప్సరసనువోని ఆమెనే వర్ణింప
శత్రువయ్యె నాదు మిత్రవరుడు.
388
నీ వెలుగుచేత సూర్యుడు నింగి మెరయు
కానిచో సూర్యు డొక బిచ్చగాని వరము.
389
కయిని శక్తి లేదు, కన్నుల బలమున్న,
దింక పానపాత్ర నెదుట నిడుము.
390
పిచ్చివలన నేమేమియో ప్రేలుచుంటి,
ఎవరి కర్థముగాకపోయెడినిగాక!
391
క్రీస్తులాగున ప్రేమ వర్షించి వచ్చి
దుఃఖమునకు మందిచ్చు వైద్యుండు వలయు.
392
నన్ను కరుణించి పిలువు మేనాడుగాని
కాను గతమును, తిరిగి రాగలను నేను.
393
మూగవడు నెప్డొ తనువల్లకీగళమ్ము
కాన దుఃఖాశ్రుగీతమే యైన ప్రియము.
394
ఇంతిచూపు తూపులలను తప్పించుకొనుట
సులభమని పరుగెత్తి నిష్ఫలుడ నైతి.
395
బానిసనె యయ్యు స్వాతంత్ర్యపరుడ నేను,
వెడలివత్తు కాశినిన్‌ గౌరవింపకున్న.
396
మిత్రుని రహస్య మందెను శత్రువునకు,
అయ్యది రహస్య మని గర్వ మంద తగునె!
397
మధువు తగినంత లే దను మాట వినిన
క్రుంగిపోయెడి నిరుపేదగుండె నాది.
398
సకియతో నాకు సంబంధసరణి వలయు,
కలయికలు లేనిచో వియోగమ్మె ప్రియము.
399
ఒరుల కొసగలేదె ఉవిద! నీ అధరమ్ము?
నాకుగూడ నోరు లేకపోదు!
400
జ్ఞప్తి కేల తెచ్చినావు వాగ్దానమ్ము?
మరచిపోతి ననును తరుణి తుదకు.
401
నా పిదప నా వలపునకు నతు లొనర్ప
నెవడు లేడాయె ననుచు దుఃఖించినాను.
402
తరుణి! నీదు రమ్యాంగుళి మరతునేని
వ్రేలినుండి గోరూడినరీతి బాధ!
403
రక్తధారలు తలపైన వ్రాలనిమ్ము
ప్రేయసీగృహసీమను వీడగలనె?
404
గ్రహములు భ్రమించెబో అహోరాత్రములును
జరుగు నేదో ఒకటి, యేల వెరగుపడగ?
405
అస్మదక్షుల తోచె గాయాల పూలు
వధ్యశిల కేగెదను హాసవదనమునను.
406
గోష్ఠి కేగి త్రాగకుండ రానేరాను,
త్రాగువరకు 'సాకి' రట్టుబెట్టు.
407
AndhraBharati AMdhra bhArati - dAsharathi - gAlib gItAlu - dASarathi ( telugu andhra )