కవితలు దాశరథి కవితలు గాలిబ్‌ గీతాలు
మరల నలనాటి విశ్రాంతి దొరికెనేని
ప్రేయసీరమ్యమూర్తి భావించగలను.
201
అన్ని బంధాల విదలించినట్టి యెడద
కురుల ఉరులందునన్‌ చిక్కుకొనెను చెలియ!
202
మధువు గ్రోలి రాగిల్లెడి వధువుమోము
చూడగోరె నా వెచ్చని చూపు లిపుడు.
203
గాలిబు నెరుంగ రెవరు లోకమ్మునందు?
మంచి కవియైన అతని నిందించు జగము.
204
మధువు తగినంత లేదను మాట వినిన
క్రుంగిపోయెడి నిరుపేదగుండె నాది.
205
ఆమె కాతిథ్యమొసగి యేండ్లయ్యె, నింక
గోష్ఠిలో మధుదీపాలు కులికిగూడ.
206
స్వర్గమం దమృతము గూర్చి పలుకు గురువ!
నీవు కొనబోవు, మాకు నందింపలేవు.
207
చేసినట్టి పాపములకు శిక్షయున్న
పాపములు చేయనందుకు వలయు రక్ష.
208
మతగురువు నిన్ను నిందింప మథనపడకు,
అందరికిగూడ మంచివా డగు నెవండు?
209
వత్తునని మాటనిచ్చె నా వలపురాణి,
ఎదురు చూచెద రాకపోయిననుగాని.
210
వ్రాయునపుడు సిరా యొల్కిపడినయట్లు
విరహనిశలు నాబ్రతుకున మరకలిడెను.
211
అభిమతము తీర్చుకొనుటె ధ్యేయమ్ముకాదు,
వివిధవాంఛ లొనర్చెడి వింత చూతు.
212
ఒక్క కోర్కెకై ప్రాణము లొడ్డబోవ
ఎన్నొ కోర్కెలు తీరకయున్న వింక.
213
హంత నా నెత్రు గని భయమందు టేల?
రక్తబాష్ప మూటలువారె బ్రతుకునిండ.
214
ఎవరి కడ కేగి నావెతల్‌ చెవులవేతు?
నన్ను మించిన బాధల నున్నవారు.
215
ప్రణయమున చావు, బ్రతుకు సర్వమ్ము నొకటె,
ఎవరికై చావగలనొ, జీవించగలను.
216
పానశాల యేడ? భక్తుని ఇల్లేడ?
నేను వెడలుచుండ తాను చొచ్చె.
217
కురులు విచ్చి కొలిచికొనుము, నీకన్నను
పొడవు లెమ్ము; గర్వపడకు చెలియ!
218
విరుల తోటపైని పెనుకోర్కి లే, దైన
నిది వసంతవేళ, ఏగి వత్తు.
219
ఎడదగాయము నోర్విచ్చె నేని నాకు
చెలియ! నీముందు నోర్విచ్చ చేతనగును.
220
బాధ భరియించలేక బాష్పజల మోడ్చి
దాన తానమాడితి, పవిత్రతను గంటి.
221
నీదు కనుచూపు కత్తిగానీ, ఎడంద
జొచ్చినపుడు మిత్రమువోలె చూచికొందు.
222
ప్రియకు నే గిట్టకున్నను ప్రియమె నాకు
ఆయమయొయారమును గన హర్ష మొదవు.
223
ఎడదలోనుండి వెడలిన, వెడలకున్న
క్రాలు నీ బాణసునిశితాగ్రమె ప్రియమ్ము.
224
నా యెదుట పానపాత్ర యున్నయెడ నింక
యెట్టి వాగ్ధాటి వెడలునో యెరుగుడోయి!
225
నీవు నేనున్న నెంత చింతించినావొ,
నీవు లేకున్న నంత చింతించినాను.
226
కుతల మిది, పిల్లవాం డ్రాడుకొనెడు చోటు
ఎవొ చమత్కారములు చూతు పవలు రేలు.
227
ఆసనము చూపకుండిన మానె చాన!
ముసుగు తీసి కుపితనేత్రములనె చూపు!
228
ఏదొమిషతోడ న న్నెవ్వరేని ఆమె
కడకు చేర్చిన నాయమ కరగునేమొ?
229
ఎంత దుష్టురాలవే? నిరాశాదేవి!
హృదయరాజ్ఞినె మరపింపజూతు.
230
ఎంత దగ్గర కేగిన నంత దూర
మేగు నాయమ, నా వల పిట్టి దౌర!
231
ఆమె కోపన, నా కథ అధికదీర్ఘ,
మద్ది వినిపింప సందేశహరుడె జడియు.
232
కరుణ గలిగియు తన పూర్వ సరణి దలచి
సిగ్గుతో తాను వెనుకకు తగ్గజొచ్చె.
233
దుఃఖవిష మింక గళమునే దూరలేదు,
నరములను జేరినపు డెంత నరకమగునొ.
234
హృదయమా! ఆమెజడముడి నొదిగియుండు,
మెంత బాధ కల్గినను భరింపు మోయి!
235
ఇతరులు త్వదీయచషకము నెంగిలింప
పెదవులార నీపిల్పు కే నెదురుచూతు.
236
ఇంతి దారికివచ్చెడిదేమొ తుదకు
నీవు తొందరపడి చనిపోవకున్న.
237
ఇంత దుఃఖము సైప నా కేకహృదయ
మేల? ఒక పది ఇవ్వవైతివేమి? దేవ!
238
ఒడలు కాలిపోయె, నెడద భస్మమ్మాయె,
నింక బూది వెదకె దేల నీవు?
239
నను వదలి పొగవలె నేగె నాదు నీడ,
గుండెలో నగ్గి గలవాని గోరు నేది?
240
తరుణిదీర్ఘ కేశములు సౌందర్యఖనులు
వెలసినవి నేడు న న్నురిపెట్టుకొరకు.
241
నాకు వైఫల్యమున రుచి రేకులెత్తు,
కాన కోర్కెలు పెంచి దుఃఖాన పడుదు.
242
కలలో నామె నాస్థితి తెలియ వచ్చు,
కనుక ప్రత్యక్షముగ నడుగంగరాదు.
243
ఏదొ అడిగెద నామె నున్మాదివోలె,
ఆమె ఉత్తరమీయ నే నాలకింప.
244
ఆమె దారిబోవుచు నాదు సేమ మడుగు,
నేమి చెప్పుదు దారిలో నింక నేను?
245
నా సమస్త మెరింగియున్నయటు లామె
మోసగించు, నింకేమి చెప్పుదును నేను?
246
నవవసంతము వచ్చి యువతినే తలపించు
పువు జూచి ఆమెమోముగ నెంచి చింతింతు.
247
'అస్తి' యని దగాచెందకుమయ్య! నీవు
వసుధపై నెంచిచూడ సర్వమ్ము 'నాస్తి'.
248
మొరపెట్టుకొనుటకై స్వరతాళములు లేవు
కన్నీటిపాటలో గణయతులు కనరావు.
249
ప్రణయ మనగ అగ్గివంటి; దంటించిన
నంట, దార్పినంత నారబోదు.
250
ఎంత కోమలాంగి ఇంతి, చేజిక్కియు
తాకదలచినంత తాకనీదు.
251
హృదయమా! ఆమె యెంత పిల్చినను రాదు,
రాకతప్పని స్థితి కల్గుగాక తనకు!
252
ఎంత దుఃఖించినను విమర్శించు నామె
కానిపని ఏమిచేసిన కానె కాదు.
253
చావగోరెడువానికి చావురాని
ఘోరదుర్గతి నిక చూచితీరవలయు.
254
ఎంతయిన సుందరులను ప్రేమించవలయు,
ఇటులె వారును వలచ నింకేమి వలయు?
255
మానిపోయెడి గాయము మాకు వలదు,
శత్రువున కది యొసగుము స్వామి! నేడె.
256
జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు
ప్రణయమే జీవితంపు సర్వస్వ మయ్యె.
257
ప్రణయ మిట్లు నన్ను భ్రష్టుజేసెను గాని
పనికివచ్చునట్టి మనిషి నేను.
258
పీడవో, పిశాచమవొ, దుర్విధివొగాని
నీవు నాదానవైతివేని అదె చాలు.
259
ఏదొ అలజడి యున్ననే ఇంటిశోభ
పెండ్లిగాకున్న, దుఃఖపువేళనైన.
260
గిన్నె నందించువారు లేకున్నయపుడు
కుండనే నోటి కానించుకొనుట మేలు.
261
స్వర్గమునుగూర్చి నాకు సర్వమ్ము తెలియు,
మనసు సంతసపడుటకు మంచి ఊహ.
262
ఆమె గనినంత నా మొగ మందగించె,
రోగి బాగయ్యె ననుకొనసాగె నామె.
263
ముద్దొసంగబోదు పొలతి, నా హృదయమ్ము
నుచితముగ గ్రహింప నూహసేయు.
264
చెప్పనిమ్ము నాదు చింతనుగూరిచి
నీకు కొంత చింత సోకునట్లు.
265
నిన్ను నిందించు జంత్రమట్లున్న నన్ను
నీవు కవ్వింతువేని ధ్వనింపగలను.
266
రాత్రి గోష్ఠిలోన రాగిల్లిన జగమ్ము
తెల్లవారగానె నల్లవారె.
267
నీదు నిండుచూపునే కోరి వేచితి,
కాంతు వేమిటె అరకంట నన్ను!
268
విరహగాఢాంధకారబంధుర గృహాన
మలిగిపోయిన ఒక దివ్వె కలదు నాకు.
269
ఇతరులను బాధపెట్టుట హితము కాదు,
కాన నావ్యథ శత్రునకైన వలదు.
270
పిన్నతనమున నాకథ వినని ఆమె
యౌవనమున నాకథ లెట్టు లాలకించు?
271
ప్రణయబాధితులనుగూర్చి పలుక వశమె?
పాదములనుండి తలదాక బాధ యొప్పు.
272
గూటివద్ద వలను నాటె కిరాతుండు
ఎగురబోయి వలను తగులుకొంటి.
273
నీ పరధ్యాన మేదో ఘనిష్ఠమైన
ప్రణయరాహస్యమును బయల్పరచుచుండె.
274
మరల క్రూరురాలికొరకు నే పలవింతు
మరల బ్రతుకు దుఃఖభరిత మయ్యె.
275
గుడిని శివుడు దొరకకున్న కాశికిగాని
పరువులెత్తి నేను బడయగలను.
276
కరుణ యెరుగనట్టి కామినీమణినుండి
కరుణ కోరుచుంటిగాదె నేను!
277
పిచ్చి హృదయమ! నీ కేమి వచ్చెనోయి!
అసలు నీబాధ కెయ్యది ఔషధమ్ము?
278
ఎచటనుండి వచ్చె నీపూలు, ఫలములు?
కారుమబ్బులేమి? గాడ్పులేమి?
279
ఆమెయనిన నాకు నధికానురాగమ్ము,
ఏనటన్న ఆమె కెంతొ విసుగు.
280
దైవమా! నీవు కోరని వేవి లేవు,
లోకమున మరి ఇట్టి కల్లోల మేల?
281
మొదట నాపయి నాకె న వ్వొదవెగాని
ఇప్పు డెద్దానగూడ న వ్వేమి రాదు.
282
నాకు విధిలేక మూగినైనానుగాని
లేనిచో నేను మాటాడలేని దేది?
283
నన్ను గూర్చి వార్త నాకె అందనిచోట
నేనె వాసముండినాను నేడు.
284
ఇప్పుడు కాశి కెట్టు లేగెద వోకవీ!
నీకు సుంత సిగ్గు లేకపోయె.
285
అన్నిబాధలు నేటితో అంతమొందె,
ఇక అకస్మాన్మరణబాధ ఒకటె మిగిలె.
286
ఇంక బ్రతుకవలసెనేని వేరువిధాన
బ్రతుకునట్టి రీతి వెతుకువాడ.
287
ఏది యమునింటి అగ్గిలో ఇంత వేడి?
కనపడక కాల్చు వేదనాంగార మిద్ది.
288
ఈవు తెచ్చిఇత్తువేని రోజటికన్న
అధికముగనె మధువు నారగింతు.
289
కాముకుండుగూడ ప్రేమమ్ము నటియించె,
ప్రేమజీవి కింక విలువ లేదు.
290
పిచ్చివాని నన్ను వేధింతు వేలనే,
కొనకు నీవె వంతగొనెద వోసి!
291
ఉవిదగోష్ఠిలో నేనుండకుంట మేలు,
నన్ను గూర్చిన ప్రస్తావనమ్మె చాలు.
292
నాకు నిష్కామకర్మ యెంతయు ప్రియమ్మె,
కాని నైరాశ్య మలమి నన్‌ కలతపరచు.
293
ఇంటిలో వసంతము ప్రవేశించగానె
నే నరణ్యమునం దుండినాను నేడు.
294
ఎంతొ పట్టనియ ట్లుందు నింతిగూర్చి,
అయినగూడ నాదు రహస్య మరసె నామె.
295
వలపునం బడి సుందరి బక్కబడెను,
చిక్కినకొలంది హెచ్చెను చక్కదనము.
296
నా రోదనమ్ము నిన్ను చేరినంతటనె
మారిపోవునుగదే మధురగానముగ!
297
నీదు లేఖను పొంది ఆమోదపడను,
జాబు తెచ్చువానిపయి నీర్ష్యపడుకతన.
298
నీవు గోడుచెప్పినా వామె వినెగాని,
ఉత్తరమ్ము నేమి యొసగలేదు.
299
ఇంత కష్టమ్ముగా బ్రతుకీడ్చు నాకు
దేవు డెక్కడ నున్నాడు భావమందు?
300
AndhraBharati AMdhra bhArati - dAsharathi - gAlib gItAlu - dASarathi ( telugu andhra )