కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
16. రుధిరదీపిక
 
మబ్బుల మస్తిష్కమ్ముల
మెరసిన ఇంద్ర చాపమ్ములు
పచ్చని గడ్డిమళ్లలో
విరిసిన ఇంద్రగోపమ్ములు;
ఇవి వర్షానికి గురుతులు
ఇవి హర్షానికి షరతులు
అవునా?
ఈ ఇంద్ర ధనుః ఖండమ్ములు
ఒకనాటికి కాలదండమ్ములు?
ఈ యెర్రని ఇంద్ర గోపమ్ములు
ఒకనాటికి రక్తరూపమ్ములు
కానోపు --
మా నిశా నిర్భర జీవితరంగమ్ములు
నిజమ్ముగా విషగంగా తరంగమ్ములు
ఒకనాటికి ఈకాలం పల్టీ తిన్నప్పుడు
ఈ జగత్తు
నవపాంచజన్య నాదం విన్నప్పుడు
నేటి వన్నీ ఆనాటికి తప్పులు
పుచ్చిపోయి పురుగెక్కిన పప్పులు.
అవునుకదా, ఆనాటికి
ఈనాటి వంకర నాగేటికి
యెంత విలువ? యెంతచలువ?
ఈ చరిత్ర చీకటి గదిలో
ఈ ధరిత్రి అమ్ముల పొదిలో
తైలదీపం వెలుతురుతో
వెదకి వెదకి వేసారినా
లభించేది కనిపించేది
పెద్దల
విద్యావంతుల
తరతరాల బూజుల
వట్టి పాతగాజుల
విలువలు
చిలువలు పలువలుగా
అల్లి, కల్పించి చెప్పే అబద్ధాల
రాజాధిరాజుల
మార్తాండ తేజుల
పురుషత్వపు, పరుషత్వపు
అల్లి బిల్లి, అల్లిక బిగి కథలు.
అవునా,
అనాథ విశ్వశ్రామికమూర్తీ!
ఆగామి యుగ పరివ్యాప్తకీర్తీ!
నీ నరనరాలలో నడిచే
'నయాగరా' 'జెర్సొప్పా'
రుధిర 'జలపాత' ధారలో
నీ కన్నీటి చారలో
జనియించిన
జగాన్ని పెంచిన
దేవుళ్ళను దెయ్యాలను మించిన
అరుణారుణ విద్యుద్దీపిక
వెలిగించుకో
తొలగించుకో
యుగయుగాల
పేదతనం బరువులు
దేశదేశాల
బీదజనం కరువులు
లే, తండ్రీ!
లయరుద్ర, మహానుభావ!
ప్రియవిశ్వ శ్రామికదేవ!
లే, తండ్రీ!
చూపించు
నా యీ పాపపు లోకం
పడిపోయే చీకటిదారుల
ఎగుడు దిగుడులు!
వెలిగించు తండ్రీ!
విరించి పుట్టుక ముందు నించి
మంచులో పొంచుకు కూర్చున్న
పీయూషవాపిక
ఈ రుధిర దీపిక.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - rudhiradIpika - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )