కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి అంకితము
అంకితము
ప్రియమిత్రుఁడు
శ్రీ నూతక్కి రామశేషయ్యచౌదరికి
నీ కనుగోనలం దొలుకు నిత్యవినిర్మలమందహాసరే
ఖాకమనీయకాంతికళికల్‌ పయి సోకిన యంత దుఃఖతా
పాకులమైన నాయెద హిమాంబుసుశీతలమౌను; తమ్మిలే
యాకులనీడ పైకొనిన యాతపతప్తమరాళముంబలెన్‌.
నాకును నీకు నెన్ని జననమ్ముల సౌహృదమో, పరస్పరా
లోకన మందె నా బ్రతుకులో నొక తీయనిస్వప్న మేదియో
పైకొనినట్టు లయ్యె నెడఁబాయుకొలందిఁ బ్రవృద్ధినొందుస్నే
హాకృతి కాటునే యుపద లల్పము లొక్క కృతజ్ఞతల్‌ వినా.
నా కవితావనీ వికసనమ్మున కామనిపంటవైన సు
శ్లోకుఁడ వంచుఁ గావ్యకళ లోతులు ముట్టిన మేటిశిల్పి వం
చీ కృతి నీ కొసంగితి సుహృద్వర! కొంచెమొ గొప్పొ 'గౌతమీ
కోకిల' పాట నీయెడఁదకుం బులకింపులకాన్క లీయదే.
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - aMkitamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )