కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 01. జయగీతి
01. జయగీతి
కావిముసు గల్లాడ వేకువ
కాంత దివసాంగణము చేరెను
గాలిలో వనపాళిలో సుమ
గంధ మలమికొనెన్‌
తరుణతరణిద్యుతుల రోదోం
తరము రంజిత మయ్యె ద్విజసం
తానగళకాహళుల ప్రాత
స్స్తవము మార్మ్రోగెన్‌
తృణము తృణమున శాంతి విరిసెను
దిక్కు దిక్కుల కాంతి మెరసెను
దేవళమ్ముల మొరసె జయఘం
టావితానమ్ము
అదె త్రివర్ణధ్వజపటాంచల
ముదయపవనోచ్చలిత మయ్యెను
వదలె జయశంఖారవమ్ముల
నిదురమైకమ్ము
వీరశౌర్యము సతులతేజము
పేదభక్తియు సాధుదీక్షయు
వృద్ధపౌరుష మొక్క నూత్నా
వేశమున వెలుగన్‌
కాలధూమోద్గత మహాగ్ని
జ్వాలికామాలికలొ జంఝా
నిలవిఘూర్ణిత నీలవారాం
నిధితరంగములో
వెలువడియె నాసేతుశీతా
చలము నరనారీసమూహము
నీ జయోత్సవ ముహూర్తము
నేడు జనయిత్రీ!
వేదధాత్రివి జ్ఞానదాత్రివి
పేదపాలిటి యన్నపూర్ణవు
వీరరాజ్ఞీ! లేదు నీకిక
పారతంత్ర్యమ్ము
నిన్నె చూతుము నిన్నె కొలుతుము
నీ మహోన్నతి పాడుకొందుము
నీ జయస్వాతంత్ర్యమంగళ
నిలయదేహళికిన్‌
తరతరమ్ముల బంధనముల వి
దల్చి నీస్వేచ్ఛాశుభోదయ
మంగళాశీః కుసుమసురభిళ
మౌళివినతులమై
కోటిగొంతుల పారతంత్ర్యో
చ్చాటజయగీతముల పాడుచు
నాటెదము నీకేతనము నా
నాదిగంతములన్‌
ప్రాణధనమానముల పూజా
ప్రసవములుగా నీమహోజ్జ్వల
పాదపీఠిక నుంతు మమ్మా
భరతజనయిత్రీ!
జయము భారతభాగ్యధాత్రీ!
జయము వినమితపుత్రపుత్రీ!
జయము శాంతిజగత్సవిత్రీ!
జయము జనయిత్రీ!
జయము హిమగిరిమణికిరీటా!
జయము సింహళపాదపీఠా!
జయము విజయాంకితలలాటా!
జయము ప్రియజననీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 01. jayagIti - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )