కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
37. గురుస్తుతి
37. గురుస్తుతి
పరమేశ్వరుని గూర్చి
ప్రస్తుతించుటకేను
పదిజన్మ లెత్తవలెనా?
    లేకతని
పదిలముగ జూడవలెనా?
పదిలముగ జూచిన
పదిజన్మ లేలను
ఇది తెలియుదాకేగద
    జన్మమును
ఇలలో తానెత్తుచుంటి
జన్మమెత్తిన యంత
కర్మమానున సుంత
జన్మ కర్మలతోడ
జన్మమున్నది కదా
ఈశు జూచుట యెట్టులో
    ఈజన్మ
రోసియుండుట యెట్టులో
జన్మబాయుట యేల
కర్మవీడుట యేల
కర్మ జేయుచు దాని
కాంక్ష వీడుట చాలు
జన్మ తా బాయవలెనా
    నిజమైన
కర్మ తా జేయవలెనా?
కర్మజేయుచు నేను
గాంచలేనను కొనుము
ఎంచి చూడగ ఈశు
పంచనే యుండెదను
ఈసారి కన్పించడా
పరమేశుడిలను తా
    నివసింపడా?
ఈశు జూడనివారు
ఇలను లేరందురు
ఈశు రూపులే కదా
ఇల జీవరాశులు
ఇలు విడిచి ఎటుపోవును
    ఈశ్వరుడు
ఇంటనే యిమిడుండును
ఈశు నింటికె కదా
ఇలయన్న శబ్దంబు
గాలిలో నీటిలో
అల గగన తలములో
గలసి యుండడె లీనమై
    మనలోన
మసలు చుండడె ప్రాణమై
దేహంబు నాదైన
ప్రాణంబు తానౌన
పట్టు పట్టియు వాని
గట్టివైచెద నేను
ఇట్టివాడని యెరుగనే
    యతడున్న
గుట్టు నాతోచెప్పవే
నీదేహ మననేల
నీవు నేనననేల
సర్వంబు తానయై
సర్వేశ్వరుండుండ
సమముగా జూడవేమీ
    నీవతని
సన్నిధిని జేరవేమి?
ఈశు జూచుటకేను
ఇలను బుట్టితి నేని
మది విడిచి చెప్పగా
ముదము గల్గును నీకు
అదనెరిగి చెప్పుమోయీ
    భగవంతు
నరయగా జాలనోయీ
అరయజాల నటన్న
అరయనే జాలవు
అరయ జాలనిదెద్ది
ఆత్మ బలమన్నచో
అనుమానమును వీడుమా
    భగవంతు
నరయగా గలవుసుమ్మా
ఆత్మ బలమున్నచో
అది నాకు తెలియదు
చూడవలెనను కోర్కి
చురుకుగా నున్నది
ఇకనైన ఎరిగింపుమా
    నామాట
ఇంపుతో నాలింపుమా
మమతలన్నీ వీడి
మది నిశ్చయము చేసి
కనులు మూసియు నీవు
కనుబొమల నడుమను
గాంచినట్లయిన వినుమా
    యొకగొప్ప
కాంతి గల్గును జూడుమా
ఏది యానందమో
యేది కన్గొందుమో
అదె ఈశు రూపంబు
మదినెంచి చూడుమా
ముదము చేకూరు వినుమా
    "నీ" వనే
పదము దానికె జెందుమా
నీవల్ల వింటిని
నాలోన గంటిని
నన్ను నే గానక
నల్లరాతికి మ్రొక్కి
నను బ్రోవుమని వేడితీ
    ఆనాడు
నను జేరడని దూరితీ
తెలివియను కలశంబు
చేతబట్టియు నాదు
మలినమగు హృదయంబు
సలిలముతొ గడిగేవు
ఆనంద రూపుండవు
    ఓ దేవ!
ఓంకార పూర్ణుండవు
ఇల తరింపగ జేయు
నల పరబ్రహ్మంబు
దెలియు మార్గము జెప్పి
అలరించితివి నన్ను
ఇలనిన్ను బొగడ దరమా
జయ గురూ
అల పరబ్రహ్మకైన
AndhraBharati AMdhra bhArati - kavitalu - 37. gurustuti - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )