కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
వక్తవ్యము

వక్తవ్యము
         - శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ.

కవిత్వం అనేది సహజంగా పుట్టుకతో రావాలి. అప్పుడే దానిలో ఒకవిధమైన శక్తీ, ఒకవిధమైన రక్తీ ఉంటుంది. కవిత్వానికీ పాండిత్యానికీ సంబంధంలేదు. పండితుడు కవి కాకపోవచ్చును. కాని కవి పండితుడు కావచ్చును. శారదా కటాక్షవీక్షణం ప్రసరిస్తే పాండిత్యం లేకపోయినా కవిత్వం చెప్పవచ్చును. పద్యములల్లడం వేరు; కవిత్వం చెప్పడం వేరు. పద్యాలల్లినంతమాత్రంచేత తత్కర్త కవిపదవాచ్యుడని అందరూ అన్నా కవికాడు. రచనలో చమత్కారము, భావములో ఔన్నత్యము, చెప్పదలచినది వ్యక్తీకరించుటలో ఒకవిధమైన సొగసు, ఇన్నిటినీ మించి ధ్వనీ ఉండాలి సరసకవితకు. కవిత్వమెప్పుడూ నిత్యనూతనశోభతో వెలుగొందాలి. పద్యమే కానక్కరలేదు, వచనములోనూ కవిత్వముంది; గేయములోనూ కవిత్వముంది. హృదయాన్ని రంజింపజేయగల శక్తి గేయానికీ ఉంది. ఇటువంటి గేయాలే ఈచిన్ని పుస్తకంలోనివన్నీ. ఇది నిజంగా సువర్ణగేయ విపంచియే.

ఈ గేయాలు రచించింది కొంపెల్ల జనార్దనరావు సోదరి శ్రీమతి చావలి బంగారమ్మ. మా బంగారమ్మకు కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది; సాధనవల్ల వచ్చింది కాదు. అది మేలిమిబంగారమే. కొంపెల్లవారి కుటుంబమే పండితకుటుంబమూ, కవికుటుంబమూను. సోదరుడు జనార్దనరావు చిన్నవయసులోనే అకాలమృత్యువు వాతబడినా అప్పటికే అంత చిన్నతనంలోనే గొప్ప సాహిత్యవేత్త అనీ, గొప్ప కవీ రచయితా అనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నాడు. ఆయుర్దాయమే ఉంటే నవ్యాంధ్ర కవితారీతులకు వన్నెలు దిద్ది దారులు చక్కజేసేవాడు. ఆతని సోదరే శ్రీమతి బంగారమ్మ - ఆ కుదిటిలో మొలచిన మొలక, ఆ నికుంజములో పెరిగిన లత. ఆమెకు కవితా వాసన లేకుండా ఎట్లా పోతుంది? సోదర ప్రోత్సాహాసారమున పండిన బంగారుపంట ఆమె. ఈ గేయ కుసుమాలు - సుమనోమనోహరాలు. పారిజాతపు పూవులు వాయుకిశోర కేళికను జలజల రాలినట్లు సోదర ప్రోత్సాహ సమీర కుమార స్పర్శమున అప్రయత్నంగా ఆ లతాంగి హృదయ నికుంజంనుంచి ఈ కవితా లతాంతాలు గేయరూపాన అవతరించాయి. ఒక్కొక్క గేయం నెత్తావులు విరజిమ్మే ఒక చక్కని చిన్నారి జాజిపూవు; దివ్యపరిమళం వెదచల్లే మల్లిపూవు. ఈ చిన్ని పొత్తం సురభిళం గుబాళించే జాజిపూవుల పొట్లం; కుందమాల; మల్లికా లత.

ఈ పాటలన్నీ ప్రకృతి శ్రీమతి బంగారమ్మచేత పాడించుకొంది. వీటిని ఆమె పాడుతూవుంటే ఎంత తీయగా తరితీపులు వెలారిస్తూ శ్రవణానందకరంగా ఉంటాయో వాటిలోని భావాలూ అంత ఉన్నతంగా, రమ్యంగా, హృదయానంద కందళితంగా వుంటాయి. ఇందులోని గేయాలన్నీ అనుకొంటాను లేదా చాలాభాగం - మద్రాసులో మాయింట సోదరుడు జనార్దనరావుతో కలిసివున్నప్పుడు వ్రాసినవే; అన్నీ నేను విన్నవే. శబ్దాలకూ అర్థాలకూ సంబంధించిన అలంకారాలుండవచ్చు పద్యకవిత్వంలో; పాండితీ ప్రౌఢిమ ఉండవచ్చు; బిగువైన పదబంధ ముండవచ్చు. అయినా గేయంలోని సొగసు గేయానిదే; అది పద్యానికి రాదు. పదాలు, పాటలు, కీర్తనలు ఎక్కువ జనాదరం చూరగొని ప్రచారంలో ఉండడానికి కారణం ఇదే. పద్యం పండిత ప్రమోదకారణమైనది; గేయం సామాన్య జనహృదయాకర్షకమైనది.

నేనెరుగుదును ఈ గేయాలెందరి ప్రశంసలో చూరగొన్న విషయం. వీటినేవో కొన్ని ఆంధ్రేతర భాషలలోని కనువాదం చేయించాలనే ప్రయత్నం జరగడం - నేనెరుగుదును.

తప్పక ఇది శారదాదేవికి సువర్ణ మణికంఠహారంగా వెలయగలదని నా నమ్మకము.

మల్లంపల్లి సోమశేఖరశర్మ.
వాల్తేరు, విలంబి, శ్రావణం,
శాలివాహన శకం 1880.

AndhraBharati AMdhra bhArati - kavitalu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu vaktavyamu - SrI mallaMpalli sOmaSEkhara Sarma - Mallampalli Soma Sekhara Sarma - geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )