కవితలు సూతాశ్రమ గీతాలు తెలుఁగుజోదులు

'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

తెలుఁగుజోదులు
గౌతమీనది, కృష్ణవేణియు
తుంగభద్రయు, సర్వదా
జీవనదులై యెండిపోవక
యెల్లకాలము పాఱుచున్‌
బీళ్ళ నన్నిటిఁ బంటపొలములు,
పండ్లతోఁటలు చేయుచున్‌,
దెల్గుదేశం బతి సుభిక్షము
గా నొనర్చును సర్వదా
    తెలుఁగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుఁగువారల మేలుకొల్పర!!

రెండుకోట్లకు మించియుండిన
తెల్గువారల నక్కటా!
చీల్చివైచిరి, నాల్గుదెసలకుఁ
జిమ్మివైచిరి నేఁటికిన్‌,
కొంతమంది నిజామురాష్ట్రము
నందుఁ జిక్కిరి బేలలై,
కొంతమందియు కన్నడంబున
నుండిపోయిరి దీనులై,
    తెలుఁగుబిడ్డా! మఱచిపోకుర
తెలుఁగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుఁగువారల మేలుకొల్పర!!

పూర్వ మెప్పుడొ యెదురులేకయె
ద్రవిడదేశము మీఁదికిన్‌
జైత్రయాత్రలు సల్పియుండిరి
తెల్గుబంటులు జోదులై
తెలుఁగుదేశం బాక్రమించిరి
యఱవవారలు నేటికిన్‌,
మెల్ల మెల్లఁగ బ్రాఁకులాడుచు
దిడ్డికంతల దూఱుచున్‌,
    తెలుఁగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!

లెమ్ము లెమ్మిఁక నడుముగట్టుము
తెల్గు వారల నెల్ల నీ
వొక్క రాష్ట్రమునందుఁ గూర్పఁగ
గట్టియత్నముఁ జేయుమా!
అన్యులెవ్వరు నడ్డఁజాలరు,
నీ మనోరథ సిద్ధినిన్‌
బడయనేర్చెద వచిరకాలము
నందె పేరు ప్రతిష్ఠతో
    తెలుగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!

ఒడ్డె బందెలదొడ్డిఁ ద్రోలిరి
తెల్గువారలఁ గొందఱన్‌,
మిగిలియుండిన వారినెల్లర
నఱవవారల కాళ్ళపైఁ
గూలఁద్రోసిరి, కేరడంబులు
కుచ్చితంబులు పల్కుచున్‌,
మఱువరాని పరాభవంబును
గల్గఁజేసిరి, యెల్లరున్‌
    తెలుగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!

తెల్గువారలపేరు మాసెను
తెల్గునాఁటను నేఁటితోఁ
తెల్గువారలకెల్ల నుమ్మడి
దేశ మొక్కటి లే దహో!
తెల్గువారల ఢాక యెఱిఁగియె
కుచ్చితంబుగ నీ గతిన్‌
చిదిమివైచిరి, యదిమిపెట్టిరి,
నాల్గుదెసలకు నెట్టుచున్‌
    తెలుగుబిడ్డా! మఱచిపోకుర
తెలుగు దేశము పురిటిగడ్డర
కొక్కొరోకో పాటఁ బాడర
తెలుగువారల మేలుకొల్పర!!

AndhraBharati AMdhra bhArati - kavitalu - sUtAshrama gItAlu - telugu jOdulu - kavirAju tripuranEni rAmasvAmi chaudari ( telugu andhra )