| కవితలు | సూతాశ్రమ గీతాలు | తెలుఁగు నాయకులు |
'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి
| తెలుఁగు నాయకులు | |
| తెలుఁగువారికి దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! ద్రవిడమంత్రి ముఖావలోకన భాగ్యసంపద యబ్బినప్పుడు, తెలుఁగు మంత్రులు మంత్రవిదులై మూఁగనోమును బట్టినపుడు తెలుఁగు శాసనసభ్యులెల్లరు తెల్లమొగములు వైచునప్పుడు | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తెలుఁగువారికిఁ దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! ఆంధ్రకేసరి రేయిఁబవలును గుహల నిద్దురఁబోవునప్పుడు, మాఱుమ్రోగెడి సింహగర్జలు మాఱుమూలలఁ జేఱినప్పుడు చెన్నపట్నము వదలిపెట్టఁగ సాహసింపక యున్నయప్పుడు | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తెలుఁగువారికిఁ దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! గద్దెయెక్కిన గద్దెవారలు గద్దఱింపులు మానినప్పుడు నిలువుమీసముపైని నుండిన నిమ్మకాయలు జాఱునప్పుడు అరవసచివునిమాట లనుచో నులికిపాటును బొందునప్పుడు | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తెలుఁగువారికిఁ దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! ఏమిచెప్పిన నేమి వచ్చునొ యేమిరాభగవంతుఁడా యని తెలుఁగుడాక్టరు నిల్చునప్పుడు కాలమాన పరీక్షఁ జేయుచు నడ్డసాళులు వైచునప్పుడు | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తెలుఁగువారికిఁ దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! రెడ్డిదొర గురుపాదులకు జే జేలుపెట్టుచు నిల్చునప్పుడు తెలుఁగురాష్ట్రము పనికిరాదని తెల్పనేర్చితి ననెడునప్పుడు తెలుఁగుపత్రిక లసలె ముట్టుట మానివేసితి ననెడునప్పుడు | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తెలుఁగువారికిఁ దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! ఆంధ్రరాష్ట్రముగూర్చి యాంధ్ర మ హర్షి యేదియు చెప్పనప్పుడు అదనులోపలఁ దెలుఁగు దేశము వదలి యప్పటికప్పు డొక్కఁడె తెల్లవారల సీమకుం జనఁ బైన మట్టే కట్టినప్పుడు | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తెలుఁగువారికిఁ దెలుఁగురాష్ట్రము తేరతేరఁగ నూడిపడునా! కాలిదెబ్బను గాళినాథుఁడు కలవరింతలు పెట్టునప్పుడు, ఆసుపత్రిని నున్నయప్పుడె యాజ్ఞపత్రము వచ్చినప్పుడు నక్కచావుగఁ దెలుఁగురాష్ట్రము పనికిరాదని చెప్పునప్పుడు; | |
| తెలుఁగుబిడ్డా! లేవలేవా! వీరపాణము సేయరావా!! | |
| తోడుఁబోతుల నమ్మనేలా! కాఁడుపరచిరి యనఁగనేలా తోడుతోడన్ నడుముగట్టిన నూడిపడదే తెలుఁగురాష్ట్రము వీరగంధము పూయరాదా! వీరతాయెతు కట్టరాదా! వీరపాణము చేయరాదా! వీరుఁడవె నీవైనచో! | |
| మొకమొకంబులఁ జూడనేలా! రకరకంబుల మాటలేలా? ఊరు ఉకమును ఒక్కటైతే ఊడిపడదా తెలుఁగురాష్ట్రము!! | |