కవితలు సూతాశ్రమ గీతాలు పిలుపు

'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

పిలుపు
ఊరకుండి యుండలేక
యూరువిడచి వచ్చినాము
పొట్టకూడు లేకకాదు
కట్టుగుడ్డ లేకకాదు
కానిడబ్బు కొఱకుఁగాదు
కానిపనులు కొఱకుఁగాదు
పేరుకోసరంబుగాదు
పేరుపేర్మి కొఱకుఁగాదు
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

ఊరుకొఱకు వచ్చినాము
నాడుకొఱకు వచ్చినాము
బీదసాదలైనవారి
పిల్పువినుచు వచ్చినాము
కూడులేక మాడుజనము
గోడువినుచు వచ్చినాము
దాస్యముఁ బాఱఁద్రోల
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

రోజురోజు పోవుచుండె
రోజకుండా నెంతొడబ్బు
ఇతరదేశజనుల చేతి
కేమి సెప్పువార మిపుడు?
సాలినేఁత సాలివడియె
మాలనేఁత మూలఁబడియె
సాలివారు మాలవారు
చచ్చుచుండ్రి కూలిలేక
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

ప్రత్తిపంట పండుచుండె
జీవయాత్ర సాగకుండె
దూది యేకువాఁడు లేఁడు
ఏకుచేయు వాఁడు లేఁడు
నూలు వడకువాఁడు లేఁడు
నేఁతనేయువాఁడు లేఁడు
యింతమంది యేలలేరొ
యించుకంత తెలిసికొనుఁడు
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

కానిదూది బట్టనేసి
కాసుకమ్ముచుండె మనకు
కాసుపోక యొకటెకాక
కూలి నాలి కూలిపోయె
పల్లెటూళ్ళు పాడువారె
ముతకబట్ట లేకపోయె
బట్టలమ్ము వర్తకుండు
పట్టణంబు చేరిపోయె
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

ఇరుగు పొరుగు వారికెల్ల
కూడుగుడ్డ లేకపోయె
కడుపు ఎంతొ మాడుచుండె
మాడుచెక్కలైనలేక
లాంక్‌షైరు నేఁతగాండ్రు
లాభమందు చున్నవను
షాహుకారు కోట్లకొలఁది
సంతరించుచుండ్రి ధనము
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

లాతిగుడ్డ గజమునమ్మ
గజముక్రుంగు నీదుజాతి
.... .... .... ...
.... .... .... ...
కడుపుచల్ల కదలకుండ
కల్లకాదు, బ్రతుకరాదు
పారతంత్ర్య మెన్నివేల
యేండ్లకైన వదలఁబోదు
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

నదురు బెదురు మాని లాతి
గుడ్డలమ్మ మానుఁడయ్య
జాతియొక్క గౌరవంబు
చంపివేయఁ గూడదయ్య
కదురుగుడ్డ లమ్ముకొనుఁడు
కదురనేఁతను గుదురు మోక్షము
    ప్రాలుమాలక బద్దకింపక
యాలకింపుఁడు తెలియఁబఱతుము

ఒక్కకులము కొఱకుఁగాదు
ఒక్కజాతి కొఱకుఁగాదు
ఒక్కమతము కొఱకుఁగాదు
ఒక్కనీతి కొఱకుఁగాదు
పోకలాడి పొంచియుండి
పొలకరింప మేలులేదు
దొంగమాట దాగఁబోదు
దొంగనడక సాగఁబోదు
    చోటులేదిట పెత్తనమునకు
ఆలకింపుఁడు తెలియబఱతుము

చేతులొగ్గుచు దండమందుము
దండమన్న సుంతజంకము
వేఁడికోళ్ళ నాలకించి
లాతిగుడ్డ లమ్మవలదు

(పికెటింగ్‌ సందర్భంలో వ్రాసింది)

AndhraBharati AMdhra bhArati - kavitalu - sUtAshrama gItAlu - pilupu - kavirAju tripuranEni rAmasvAmi chaudari ( telugu andhra )