కవితలు సూతాశ్రమ గీతాలు తెలుఁగువారలు పిరికివారా!

'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

తెలుఁగువారలు పిరికివారా!
కంచికోటలు కంచుతల్పులు
ఖంగు ఖంగున మ్రోఁగునప్పుడు
తంజ నగరపు కోటగోడలు
చెంగు చెంగున నెగురునప్పుడు
తిరువటంబునఁ జేర సేనలు
కెవ్వు కెవ్వున నఱచునప్పుడు
మధుర కోటయగడ్త లన్నియు
ఱివ్వుఱివ్వున దూఁకునప్పుడు
     తెలుఁగువారలు పిఱికివారలొ
తెలుగుబిడ్డా! తెలుసుకొనుమా!!

తెలుఁగువారల యీటెపోటులు
తెలుఁగువారల నీటుగోటులు,
తెలుఁగువారల పోటుమాటలు
తెలుఁగువారల యేటుపాటులు
తెలిసి మెలఁగిన గోలుకొండ
విజాపురంబును నాముదాపురి
నడిగిచూడుము, యేమి చెప్పునొ
తెలుఁగువారల ప్రాఁతకతలన్‌!
     తెలుఁగువారలు పిఱికివారలొ
తెలుగుబిడ్డా! తెలుసుకొనుమా!!

ఓరుగంటిని దండువిడిసిన
దేవగిరి యాదవనృపాలుని
ఓరగంటను గాంచి యప్పుడె
దేవగిరి దర్వాజవఱకున్‌
తఱిమి తోల్కొని పోవఁబోవఁగ
పూరిమేయఁగ నభయమిచ్చిన
తెలుఁగుదొరసా నైన రుద్రమ
దేవి కీర్తిని లోక మెఱుఁగదె
     తెనుఁగువారల యాఁడుబిడ్డల
తెగువ బిగువులు తెలిసికొనుమా!!

వీరరసమే వెల్లివిరియఁగ
వెనుక తగ్గని పల్లెనాఁటన్‌
కాలిబంటుల కాలిక్రిందను
నలఁగిపోయిన దండుబాటల్‌
అరులమూఁకను జెఱలఁబెట్టిన
అరిది యగు మాచెఱలకోటన్‌
పేరుగ్రుచ్చియుఁ బిలిచి యడుగుము
తెలియవచ్చును తెలుఁగువ్రేటున్‌
     ప్రాఁతకతలన్‌ బాడకుండినఁ
దెలుఁగుబిడ్డా! పరువు దక్కునె?

ఢిల్లీసురతాన్‌ పౌజుదారులు
ముట్టడింపఁగ మూఁడుమాఱులు
తురక కత్తులు దాఁకినంతనె
చుంయి చుంయన గంటు నెత్తురు
పొంగి పొరలఁగ నోరుగంటను
ద్రోలివేయవె ఢిల్లి దాఁకను
తెలుఁగుకత్తులు తురకబిడ్డలఁ
దెంపు పెంపున నెల్ల దాఁటఁగ
     పెద్దవారలఁ బిలిచి యడుగుము
తెలియఁబఱుతురు తెలుఁగుఢాక

రెడ్డిదొరలును కమ్మదొరలును
వెలమదొరలును కాపుదొరలును
రాచదొరలును; మొక్కవోవని
పౌరుషంబులఁ బోరుసలిపియు
గౌతమీనది కృష్ణవేణిని
తుంగభద్రను సహ్యజానది
నెత్తు రొలికిరి, కాలవశమునఁ
గత్తి గడిగిరి, మూలఁ బెట్టిరి
     ఇంతమాత్రనె మఱచిపోకుము
తాత తండ్రుల వన్నె చిన్నెలు!

మఱచిపోకుము మఱచి పోకుము
మన్నెదొరలను తెల్గునాటఁను
మఱవకుండఁగ మూఁడుప్రొద్దులఁ
బాడుచుండుము వారిపాటను,
తేటమాటలఁ దెలియఁ జెప్పుము
దిక్కులన్నియు మాఱుమ్రోఁగిన
తెలుఁగువారల పేరుపెంపును
దెలియకుండఁగ నుండఁబోకుము
     తెలుఁగుబాలుఁడ యింపు నింపుము
తెలుఁగుబాలుఁడ పేరు పెంపుము!!

AndhraBharati AMdhra bhArati - kavitalu - sUtAshrama gItAlu - telu.rguvaaralu pirikivaaraa! - kavirAju tripuranEni rAmasvAmi chaudari ( telugu andhra )