కవితలు సూతాశ్రమ గీతాలు ప్రతాపరుద్రీయము

'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

ప్రతాపరుద్రీయము
తెలిసికోర యుగంధరుం డను
తెలుఁగుబ్రాహ్మణమంత్రి లేఁడుర
తెలిసికోర జనార్దనుండను
తెలుఁగుబ్రాహ్మణమంత్రి లేఁడుర
వినర వేంకటరాయశాస్త్రుల
పిచ్చివాఁడునుగూడ లేఁడుర
పేరిగాఁ డను పెద్దచాఁకలి
వెధవ యంతకుమున్నె లేఁడుర
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఢిల్లికేగినమాట యుత్తది
ఢిల్లిసుల్తాన్‌ బట్టు టుత్తది,
ఓరుగంటి ప్రతాపరుద్రుని
నోరుగంటిని జేర్చుటుత్తది
ఆ యుగంధరమంత్రి దీనిని
నంతచేసెను ననుట యుత్తది,
ఔర! ఔర!! ప్రతాపరుద్రుని
నాటకం బదె బూటకంబుర
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఢిల్లిదగ్గర గంగయుండెనొ?
గంగయొడ్డున ఢిల్లియుండెనొ?
గంగమీఁదను బడవయెక్కిన
ఓరుగంటిని జేరఁగలఁడే?
ఔర! వేంకటరాయశాస్త్రీ!
ఔర! వేంకటరాయశాస్త్రీ!!
ఎంత బొంకును బొంకి పోతివి
చచ్చి యెచ్చట నుంటివోకద
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఓరుగంటి ప్రతాపరుద్రుని
యొద్ద బ్రాహ్మణమంత్రియొక్కఁడె;
ఊరు పేరును లేదు వానికి
నూర కాతఁడు మాసిపోయెను;
బ్రాహ్మణేతరమంత్రు లుండిరి,
వారు తీర్చిరి రాచకార్యము,
కార్యఖడ్గములందు చతురులు,
కాని వారల నెఱుఁగ రెవ్వరు!
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ముక్కుత్రాళ్ళను బోసి రిపులకు
ముప్పదేడులు రాజ్యమేలెను
సాహసాంకుఁడు చటులవిక్రమ
శాలి మా ముసునూరి కాపయ
ఓరుగంటిని తొలఁగిపోయిన
తెలుఁగువారల ప్రతిభ నిల్పెను
తెలుఁగువారల కత్తిదెబ్బలు
దిక్తటంబుల మరల మ్రోగెను
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

ఓరుగంటి ప్రతాపరుద్రుఁడు
బందెపోవుట వాస్తవంబే,
బందెతీర్చిన మాసటీఁడొక
బ్రాహ్మణేతర దండనాథుఁడు
"రాయబంది విమోచకుం"డను
రాయబిరుదముదాల్చె నాతఁడు
ప్రజలు నేఁటికి మఱచిపోయిరి
వాని మాటను జెప్ప రొక్కరు
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

బందె వదలిన పిదప రాజ్యము
నేలలేదు ప్రతాపరుద్రుఁడు,
సిగ్గుచేతను గౌతమీనది
చెంతఁ జేరుచుఁ దపముచేయుచు
బందెవీడెను - బొందె వీడుచు
భూతలేశ్వరుఁ డంతెగానీ
ఓరుగంటిని మరలఁ గంటను
నొక్కనాఁడునుఁ జూడలేదుర
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

తప్పుపాటలు పాడఁబోకుము
తప్పుమాటలు చెప్పఁబోకుము
తప్పుకథలను జదువఁబోకుము
తప్పుదారులఁ ద్రొక్కఁబోకుము
ప్రాఁతకథలను దెలిసిచదువుచు
పాటఁబాడుము పరులు మెచ్చఁగ
కల్లవ్రాఁతలు తొలఁగ బుచ్చుము
కల్లకథలనుఁ బులిమి పుచ్చుము
    తెలుఁగుబిడ్డా! తెలుఁగు చరితను
నేఁటికైననుఁ దెలిసికోరా!!

AndhraBharati AMdhra bhArati - kavitalu - sUtAshrama gItAlu - pratAparudrIyamu - kavirAju tripuranEni rAmasvAmi chaudari ( telugu andhra )