కవితలు సూతాశ్రమ గీతాలు సారంగధర

'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి

సారంగధర
రంగభీముఁడు మాళ్వదేశపు
రాజు రాజనరేంద్రవరునకు సా
రంగధరుఁడను కూర్మిబిడ్డఁడు
ప్రథితసాధ్వి పతివ్రతామణి ర
త్నాంగి యనెడి కళత్ర మొక్కతె
హావ భావ విలాసినీమణి చి
త్రాంగి యనునొక భోగకామిని
యలరు చుండిరి వైభవోన్నతిచే
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

అంగజ ప్రతిమానరూపుఁడు
యౌవనస్ఫుటదీప్తతేజుఁడు, సా
రంగధరునిన్‌ గాంచి, మోహము
రగులుచుండఁగ భోగకామిని చి
త్రాంగి, పైఁబడెఁ బావురాలకుఁ
దనదునింటికి వచ్చినప్పుడు, సా
రంగధరుఁ డొడఁ బడమి చేతఁ బ
రాభవంబునఁ గ్రుళ్ళి కుసుమారెన్‌.
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

ఱంకు లెన్నో యంటఁగట్టుచు
రాజుతోఁ జిత్రాంగి చెప్పెను
ఱంకెవేయుచుఁ గన్నబిడ్డను
రద్దిఁజేయుచుఁ, గాలు సేతులఁ
గొంకకే నఱికించి వైచెను
గొలువు వద్దని చెప్పుచుండిన
వేంకట కవీంద్రుఁ డిది చెప్పెను
వెనుకకాలమునందు నెప్పుడో
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

ఔర! రాజనరేంద్రుఁ డనియెడి
నామసామ్యముచేత నెవ్వరో
మాళ్వదేశపురాజు కథలను
గౌతమీనదిచెంతఁ జేర్చిరి
తెలుఁగురాజున కంటఁగట్టిరి
తెలుఁగువారికి నచ్చఁజెప్పిరి
తెలుఁగుదేశము నాల్గుమూలల
తెలుఁగు కథయని పులిమి పుచ్చిరి
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

ఇదిగొ చిత్రాంగి దగు మేడన
నదిగొ సారంగధరు మెట్టని
ప్రజలు గట్టిగఁ జెప్పసాగిరి
ఇదిగొ పులియన నదిగొ తోఁకని
చెప్పుచుందురుగాదె లోకులు
చిలువ పలవలుచేసి, యీకథ
దేశమెల్లను నల్లుకొనియెన్‌
తెలుఁగువారల సొంత కథగా
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

ఔర! యీకథ యిట్టు లుండఁగ
వేఱె "కంపిలి" శాసనంబున
మాఱుపేరులతోడ నీకథ
బయట పడియెను నిన్న మొన్ననె,
ఏమి చిత్రమొ! యొక్క కథయే
ఇన్ని చోటుల నవతరించెను
విన్న వారలు నవ్వకుందురె!
పిన్న పెద్దలు నవ్వకుందురె!!
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

లేఁడు సారంగధరుఁ డనియెడి
సుతుఁడు, రాజరాజనరేంద్రునకున్‌
లేదు చిత్రాంగియను వేశ్యయు.
తెలుఁగుదేశపుఁజరిత గాదిది
వట్టి బూటకమయ్యె నీ కథ!
పిట్టకథయే! పిట్టకథయే!!
    తెలుఁగుబిడ్డా! తెలుగుచరితను
దెల్పుచుంటిని దెలిసికొనుమా!!

AndhraBharati AMdhra bhArati - kavitalu - sUtAshrama gItAlu - sAraMgadhara - kavirAju tripuranEni rAmasvAmi chaudari ( telugu andhra )