| కవితలు | సూతాశ్రమ గీతాలు | వీరగంధము |
'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి
| వీరగంధము |
| వీరగంధముఁ దెచ్చినారము వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ! పూసి పోదుము, మెడను వైతుము పూలదండలు భక్తితో!! |
| తెలుఁగు బావుట కన్ను చెదరఁగ కొండవీఁటను నెగిరినప్పుడు తెలుఁగువారల కత్తిదెబ్బలు గండికోటను కాచినప్పుడు |
| తెలుఁగువారల వేఁడినెత్తురు తుంగభద్రను గలసినప్పుడు దూరమందున నున్న సహ్యజ కత్తినెత్తురు కడిగినప్పుడు |
| ఇట్టి సందియ మెన్నఁడేనియుఁ బుట్టలేదు రవంతయున్! ఇట్టి ప్రశ్నల నడుగువారలు లేకపోయిరి సుంతయున్. |
| నడుముగట్టిన తెలుఁగుబాలుఁడు వెనుక తిరుగం డెన్నఁడున్, బాసయిచ్చిన తెలుఁగుబాలుఁడు పాఱిపోవం డెన్నఁడున్. |
| ఇదిగొ! యున్నది వీరగంధము మై నలందుము మైనలందుము; శాంతిపర్వముఁ జదువవచ్చును శాంతిసమరం బైనపిమ్మట. |
| తెలుఁగునాఁటిని వీరమాతను జేసిమాత్రము తిరిగి రమ్మిఁక, పలుతుపాకులు పలు ఫిరంగులు దారి కడ్డము రాకతప్పవు |
| వీరగంధముఁ దెచ్చినారము వీరుఁ డెవ్వఁడొ తెల్పుఁడీ! పూసిపోదుము, మెడను వైతుము పూలదండలు భక్తితో!! |