కవితలు నయాగరా 1. నా గీతం - బెల్లంకొండ రామదాసు
1. నా గీతం (జనవరి 44) - రామదాస్‌
మానవ మేధస్సుకు
సంకెళ్ళను
తగిలించిన
గత సాంఘిక
శిలా శాసనం
పడగొట్టను
పగిలిన నా నిప్పుల కంఠం
పలికిన విప్లవ గీతం
ప్రపంచాన్ని
పసిఫిక్‌ రంగంగా
పగిలించిన నా గీతం
జగత్తునొక
నయాగరా
జలధారలుగా
వర్షించిన
నా గీతం
లోకంలో
స్వేచ్ఛా విద్యుచ్ఛక్తులు
ప్రవహించిన
నా గీతం
కదలని
సమాజ
హిమాలయంలో
కదిలే
నవక్రాంతి బాడబాగ్ని
మండించిన
నా గీతం
అనార్కలీ
సమాధిలో
అశ్రు దీపికలు
వెలిగించిన
నా గీతం
అక్బర్లను
కండలుగా
ఖండించిన
నా గీతం
యుగాల నుంచీ
నడిచే
నియమపు రైళ్ళకు
పట్టాలను
పీకేసిన
నా గీతం
చీకటిలో
పడి మ్రగ్గిన
లోకానికి
దూరపు
తీరాల్లో
మండే
కాగడాలు
చూపించిన
నా గీతం
గత సాంఘిక
నరబలి నగరంపై
బాంబులు
దూకించిన
నా గీతం
సంకెళ్లను
బంధాలను
త్రెంచెయ్యను
నిప్పుల
కత్తెరలను
సృష్టించిన
నా గీతం
జగత్తులో
జలప్రళయం
తెచ్చిందట
ప్రపంచాన్ని
మార్చిందట
స్వేచ్ఛా
మహాగ్ని
పర్వత
శిఖరాంచల
రక్త జ్వాలికగా
మండిందట
సమ్రాట్టులు
చాచిన
నెత్తుటి
నాలుకలే
నరికిందట
హిట్లర్లకు
చాణక్యులకు
గోరీ కట్టిందట
కాలపు
దారుల్లో
చీకటి
ముళ్లను
తొలగించిందట
వెన్నెల
పూవులు
చల్లిందట
శ్రామిక జన ఫాలంలో
ఎండని ఘర్మజలం
చల్లని
చేతులతో
తుడిచిందట
వర్గరహిత
సంఘ స్వర్గానికి
పూల నిచ్చెనలు
వేసిందట
నరహంతలకు
చెరసాలలకు
ఉరి తీర్పులకు
నిరంకుశ
నియంతలకు
తలకొరువులు
పెట్టిందట
గతలోకం
కాల్చిందట
నవలోకం
చూపిందట
నడవండని
చెప్పిందట
నరాలు
వణికించిందట
కండలు
కదిలించిందట
గుండెలు
మండించిందట
మేధస్సుకు
రెక్కలు కట్టిందట
జీవితాన్ని
విహంగం
చేసిందట!
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - nA gItaM - bellaMkoMDa rAmadAsu ( telugu andhra )