కవితలు నయాగరా 2. ఈ రోజున - బెల్లంకొండ రామదాసు
2. ఈ రోజున (జనవరి 44) - రామదాస్‌
చరిత్రలో
తిరిగిన
మరణపు
తిరగట్లో
బియ్యపు
గింజల్లా
నలిగి
నలిగి
మండిన
గుండెల్లో
కండలు
ఎర్రని
జెండాలై
ఎగిరిన వీ రోజున!
బాడుగ
బండికి
కట్టిన
ఎద్దుల
మెడ పట్టెడ
గంటల గణగణలో
నినదించిన
కంఠాలే
నిప్పుల
రణ శంఖాలై
పగిలిన వీ రోజున!
పాతాళం
బ్రద్దలుగా
పగిలిం దీ రోజున!
పడగలు
విప్పిం దీ రోజున!
జగత్తు
ఒక సోల్జర్‌ అడుగై
కదనానికి
కదిలిం దీ రోజున!
పాతాళపు
చీకటి
మంటల్లో
ఆకలి
ఎండల్లో
పడిమ్రగ్గిన
దీన
హీన
మానవ
హృదయంలో
ఆకాశం
పగిలిం దీ రోజున!
గానుగలో
సున్నంలాగా
రైలు క్రింద
పట్టాల్లాగా
చెప్పుక్రింద
చీమల్లాగా
నలిగిన మానవులారా
పగిలిన గుండెల్లారా
తరిగిన కండల్లారా
మీకోసం
నడిచే సోల్జర్‌
ఎగిరే పైలట్‌
కదిలే టాంక్‌ డ్రైవర్‌!
మీకోసం
ఫైటర్‌ మంటలు!
మీ కోసం
టాంకుల చప్పుడు
మీ కోసం
విసిరిన బాంబులు
మీ కోసం
కదిలే స్టీమర్‌!
పసిఫిక్‌ రంగంలో
బర్మా అడవుల్లో
మాస్కో గేట్లల్లో
పారిస్‌ వీధుల్లో
లండన్‌లో
వాషింగ్‌టన్‌లో
ఇటలీలో
బెర్లిన్‌లో
చైనా లోయల్లో
పృథ్వీ గర్భంలో
ప్రతి అణువూ
ప్రసవించిన
యుద్ధాగ్నులు
మీ కోసం!
మీ కోసం!
మీ కోసం
నిలిచిన మాస్కో!
మీ కోసం
కూలే బెర్లిన్‌!
వీరులదే
మారే లోకం
వీరులకే బీర్‌ బాటిల్‌!
గట్టర్లల్లో
అట్టడుగున
శోషిల్లిన
దీనులార!
మరచక్రం
తిప్పితిప్పి
అరిగిన
చేతులార!
మీ ఘర్మజలం
అఖండ గోదావరిగా
పొంగిం దీ రోజున!
ఆనకట్ట
త్రెంచిం దీ రోజున!
పురోగమించిన మీరే
తిరోగమించే బెర్లిన్‌
భవిష్యత్తు
మిమ్మల్నే
స్వయంవరం
చేస్తున్నది!
మీ మెళ్లో
పూలమాల
వేస్తున్నది!
మీ కళ్యాణానికి
రణ ధనుస్సు
విరిగిం దీ రోజున!
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - ii roojuna - bellaMkoMDa rAmadAsu ( telugu andhra )