కవితలు నయాగరా 4. మన్యంలో - కుందుర్తి ఆంజనేయులు
4. మన్యంలో (ఏప్రిల్‌ 43) - ఆంజనేయులు
సమిష్టి
సత్యాగ్రహం దేశాన్ని
సకలం ముంచెత్తిన రోజులు
మన్యంలో
తిరుగుబాటు
ప్రభుత్వం విరగబాటు అణిచేసిన
గొడ్డలి పెట్టు
రాచరికపు బాటల్లో
రాజుకున్న కారుచిచ్చు
మన్నుతిన్న పాముల్లాంటి
మన్యం వీరుల గుండెల్లో
రేగినై ప్రళయ ప్రళయంగా
తుఫాను సహస్రాలు
అమాయక హృదయాల్లో
రగిలి విప్లవ జ్యోతులు
మన్య సముద్రంలో
చెలరేగిన అవమాన
బడబాగ్ని జ్వాలకు
రాజుకున్నై ప్రభుత్వ భవనాల్‌
రాజధాని నగరంలో
మా చేసిన
మన్యవిప్లవం దేశానికి
మార్గదర్శి
దిగి వచ్చిన వెలుగుబాట
సెంటు జార్జి
కోట చెవుల్‌ చెదిరించిన
విప్లవ దుందుభి!
'మిరపకాయ తపాలా'కు
మిలిటరీ తుపాకి బారులు
సమాధానం చెప్పలేక
సగం చచ్చి కూచుంటే
తెనుగు రాజు
కరకు దనం
తెలిసింది ప్రభుత్వానికి
న్యాయం బురఖా తగిలించిన
ప్రభుత్వానికి పట్టు గొమ్మలు
విప్లవాన్ని విరిచెయ్యను
ముఠాదార్ల శపథం!
ముఠాదారీ ముసుగుల్లో
జరిగే
అక్రమాలకు
విరుగుడు మన్య విప్లవం
మన్యంలో ప్రభుత్వానికి
మలేరియా చలి జ్వరం
పట్టుకొని బాధిస్తే
విజృంభించి నిప్పుల కంఠం
వినిపించిన విప్లవ గీతం
వినేసరికి
బెదిరిపోయి
ప్రభుత్వానికి తెల్ల గుడ్లు
పడినై
మదరాసు నుండి
మలబారు నుండి
తోలుక వచ్చిన సైన్యంలో
కమాండరిన్‌ చీఫులు
శివాలయం గోడమీద
చెక్కించిన
విగ్రహాలు!
మన్యంలో పేరుకున్న
మత్తంతా విదిలించిన
మా హృదయాలు
కదిలించిన
దిగంతాలు మండించిన
దీపికలై శౌర్యాగ్నులు
ప్రచండమైన మన్య విప్లవం
అనామకంగా
వీచిన ఒక
చిరుగాలి తరంగంగా
చేసింది ప్రభుత్వం
వ్రాసింది రికార్డుల్లో
మూసేద్దా మని లోకం కళ్లు!
రాజద్రోహంగా, నేరంగా
దోపిడిగా, దొమ్మీగా
చరిత్రలో వ్రాసుకున్న
చేదస్తపు వ్రాతలకేం -
మన్య విప్లవం
మా చరిత్రలో
వీచిన జంఝానిల వీచిక!
విదళించిన వీరుని ఖడ్గం
పగ పట్టిన పాము బుసా
చూపించిన విప్లవ మార్గం
సామ్రాజ్యపు
కత్తుల వానకు
పట్టించిన స్వర్ణ చ్ఛత్రం
అధికారపు అన్యాయమ్ములు
అడ్డించిన రక్షా కవచం!
మన్యవిప్లవం
మా చరిత్రలో
వీచిన జంఝానిల వీచిక!
బంధించిన
బానిసత్వ
విచ్ఛేదక వీర మూర్తి
విప్లవ శరదాకాశం
వెలిగించిన విద్యుద్దీపం
రామరాజు
హృదయంలో
రగిలిన స్వాతంత్ర్యేచ్ఛ!
మన్యవిప్లవం
మా చరిత్రలో
వీచిన జంఝానిల వీచిక!
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - manyaMloo - kuMdurti aaMjaneeyulu ( telugu andhra )