కవితలు నయాగరా 5. జయిస్తుంది - కుందుర్తి ఆంజనేయులు
5. జయిస్తుంది (అక్టోబర్‌ 41) - ఆంజనేయులు
గడచిన చరిత్ర
యుగ సంధుల్లో
కలకాలం కలలు గన్న
మా నరజాతికి
విముక్తి నేడే
రక రకాల దోపిడి దొంగల
పరిపాలనలో
ఏ నాటికి
తీరని కోరికైన
మానవ జాతికి
విముక్తి నేడే
జగత్తులో నిప్పుల యజ్ఞం
చేయించిన నియంతలారా!
కాలానికి కట్టలు కట్టిన
కర్కోటక ప్రభువుల్లారా!
నాగరికత పేరిట
జరిగే
నరహత్యలకూ
జాతీయోన్నతి
మిషతో
సాగే పరపీడనకూ
ఉత్తర వాదులు మీరే
ఉరికంబం పిలుస్తోంది
నిజం తెలిసిన శివమెత్తిన
ప్రజా విజయ రథ సారథి
చర చర చర చర నడిచే
శర వేగంతో నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
తుపాకులూ
శతఘ్నులూ
దూకించిన
రణరంగంలో
నెత్తుటితో మత్తెక్కిన
వీర వరుల
విహారాలు
చెలరేగిన చైతన్యం
నలుదిశలా ప్రజాబలం
జయిస్తుంది జయిస్తుంది
దారిలేని
తెన్నులేని
జగతి నడత నిరసించను
శాశ్వత శాంతికి
మార్గం సాధించే
యీ సైన్యం
గొడ్రాలికి పుత్రభిక్ష
మాపాలిటి కల్పతరువు
గబ గబ గబ గబ
నయాగరా జలపాతంలా
నడిచే విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
కత్తికి మేధస్సులు లొంగీ
నెత్తురుటేరులు పొంగీ
చరిత్రలో
కనని వినని యెరుగని
నరబలి జరుగుతోంది!
మానవ మర్యాదలు
మరచిన మా
నరజాతికి
చైతన్యం కలిగించను
చిందిన
క్షీరాంబుధిలా
శివ సాయం నటనంలా
చక చక చక చక
నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
త్యాగానికి
త్యాగం నేర్పే యోగుల్లారా!
ఇరుగు పొరుగు జాతుల కొరకై
విరామమే యెరుగని
పురోగామి సైనికులారా!
సకలం తెగించి పోరే
సమరంలో జయించి మీరే
నిర్మాతలు - నవ జీవన
నిర్ణేతలు
విప్లవమన్నది
రక్తపాతమను
వెర్రి నినాదం
వినకండీ!
మారే జగతికి మరో జగత్తుకు
చేరే మార్గం చూడండీ!
జగద్దుఃఖ శమనానికి
కదిలిన
కరిగిన
కరుణా రస మహానదం
టక టక టక టక
నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
పాపం పండిన
పతన స్థితిలో
దరితోచని సామ్రాజ్యాలూ
పెట్టుబళ్ల ప్రతాపాలూ
సాగించిన
తుది సమరం
చేసిన విఫల యత్నం!
ప్రపంచాన్ని
ప్రాణంతోనే
బలి యియ్యను
ఉరి తియ్యను
నిరంకుశత్వపు
ఉక్కు పునాదుల నిర్మించిన
నియమ శృంఖల
తెగ గొట్టేందుకు
పొగ గొట్టంలో
రగుల్తోంది చూశారా
నరులందరి విజయపు టవధికి
నడిపించే నవయుగ మధుకీల!
విజయానంతర లోకంలో
కరకర కర పొడిచే
ప్రొద్దులాగు
చర చర చర చర నడిచే
విప్లవసైన్యం
జయిస్తుంది జయిస్తుంది
కార్మిక కర్షక
వీరులతో
విహంగాలులా
విమాన యానం
చేసే
సైనిక సిద్ధులతో
కొండలలో కోనలలో
గెరిల్లాల గుంపులతో
సకల మానవుల
సౌఖ్యం కోసం పోరే
సమరంలో జయించి మీరే
నిర్మాతలు - నవజీవన
నిర్ణేతలు
గతకాల కథల్లో లేందీ
కన్పించే నేటిది కాందీ
మరో ప్రపంచపు
మహదాశయమే
మార్గదర్శిగా
నడిచే
సైన్యం
కదలిన
కనక రథంలా
వదలిన
బ్రహ్మాస్త్రంలా
ఫెళ ఫెళ ఫెళ ఫెళ
నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
శతాబ్దాల వెనుకటి
చీకటి
చరిత్రలో
రారాజులు
చేసిందే
ఈ రోజున జరుగుతోంది
అదే అదే
ఆ నాటికి ఈ నాటికి
అదే అదే
కొద్దిమంది లోకాన్నంతా
కొల్ల గొట్టుకుని
తినే విధానం!
ఉదరంలో
క్షుధాజ్వాల పెట్టిన
వగలే
పొగలై
యెగసిన
భుగభుగ మంటలు భోగిమంటలై
శ్రీమంతుల సంక్రాంతి మంటలై
అనాదిగా లోకంలో పేరుకున్న
తారతమ్యతల
ఫలితంగా
ఈ నాటికి
పతితులకూ పీడితులకు
కార్మికులకూ కర్షకులకు
కలిగిన
చైతన్యపు మంటకు తోడు మంటలై
వీర వరుల
విప్లవ సైన్యం వేసే
అగ్ని విహారం చేసే
తుఫానులై శతఘ్నులై
పరువెత్తే
నరహంతల
వెనుదవిలిన బ్రహ్మహత్యలా
వరంలాగ
శరంలాగ
ప్రళయంలా ప్రభంజనంలా
నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
సిరిలో
పొర్లాడిన
శ్రీమంతులకూ
ఆకలితో
మోకరిల్లిన
అసువులు విడిచిన
దిక్కులేని
దీనులకూ
చోటులేని లోకాన్నే
విప్లవ సైన్యం కోరింది
గతకాలపు మతాలకూ
శ్రుతి కలవని కులాలకూ
తరతరాలు పీడించిన
పరిపాలన పద్ధతికీ
వీలులేని లోకాన్నే
విప్లవ సైన్యం చూసింది
తారతమ్య
రహితమైన
తరువాత - జగత్తు గీతం
వినిపించే
వీధుల్లోనే
విప్లవ సైన్యం నడిచింది
వీచే పెనుగాలి లాగ
నా చేతి కలంలాగ
ననా ననా ననా ననా
నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - jayistuMdi - kuMdurti aaMjaneeyulu ( telugu andhra )