కవితలు నయాగరా 6. తరువాత - కుందుర్తి ఆంజనేయులు
6. తరువాత (సెప్టెంబర్‌ 42) - ఆంజనేయులు
చాలీ చాలని
కూలి జీవనం
కండల తరుగూ
మండే ప్రేవులు
తెలియని అజ్ఞానంలో
చిమ్నీదీపం చీకటిలో
నిరాశలో
నిద్రించిన జీవులు!
మనిషిని మనిషీ
జాతిని జాతీ
దోచుకున్న
పురాతన గాథలవి!
కల్పించిన
సాకుల ముసుగుల
లోపలి దోపిడికై
ఆకాశంలో
దూకించిన విమానాలు
విడిచిన
గురితప్పిన
బాంబుల దెబ్బకు తిమింగలం
భయపడ్డది
పేరుకున్న
పేరాసలు వేరుపురుగులై
కూలిన
సామ్రాజ్యాలు
పాలించిన నాటి
చరిత్రల పోకడలవి!
శతాబ్దాలు
తెర మరుగై
చరిత్ర పరువెత్తిన
చీకటి కోనల్లో
ప్రజా విజయ
చైతన్యం
ప్రబలిన మానవ హృదయం
అగ్ని పర్వతం బ్రద్దలయింది!
కాలం
చీకటి
మార్గాలను కబళించిన
తేజశ్శాలీ!
అగ్ని పర్వతపు
విముక్తి వదనపుటెదలూరిన
శాంతికరా!
నిలువలేవు నీ ముందు
నీ కను చూపుల బాకుల ముందు
దేశభక్తి ద్రోహమనీ
దోపిడి పరిపాలనమనీ
నిరూపించు
కురూపి శాసనాలు!
ప్రాణ త్యాగంలో
రక్తంలో
బలిలో
కర శృంఖలలో
నవోదయం నాట్యమాడి
పెట్టుబళ్ల ప్రభుత్వాలకు
వర్తక సామ్రాజ్యాలకు
వినాశ హేతుక
విప్లవ శంఖం
వినపడ్డది
కనపడ్డది
కార్మికలోకం
శివమెత్తిన రక్తపతాకం!
జగచ్చక్రమొక
బలివితర్దిగా
చేసిన
నరహంతల పాలన
శాంతిమూర్తి కరవాలపు
మెరుగుల్లో విరిగిందో!
సకలం
వికసించిన విజ్ఞానం
అంధకార
జగన్మార్గములు
వెలిగించిందో!
మనలో మనకే
పెనుమంటలు పెట్టిందీ
కనుకట్టులు కట్టిందీ
యుగయుగాల
చరిత్ర పరిధుల్లో
పెరిగిన
తరతమ వర్గ విభేదం
మరణ శిలలు వ్రాసుకుంది
నియంతల విటలాక్షుల్లో
నిప్పులు చెరిగిన
కదనావనిలో
నిర్మించిన
శవ సామ్రాజ్యాలకు
పాడమంది
భరత వాక్యం!
పరపీడనలో బానిసత్వమూ
ఉరి శిక్షలు ద్వీపాంతర వాసం
పెట్టుబళ్ల రాజనీతి
పుట్టించిన
చట్టాలకు న్యాయాలకు
చదవమంది స్వస్తిగీతి!
ఒక వేపున
అధికోత్పత్తీ
మరో వేపు డొక్కల కరువూ
కట్టిన ఆర్థిక సోపానాలూ
సాధనాల వ్యక్తిగతత్వం
చాలన్నది సాగవంది!
అన్యాయం అక్రమమూ
సంఘంలో చదరంగం
పరస్పరం దొమ్మీ దోపిడి
ఆరంభించని
ఆదియుగంలా
మంచి మీద బ్రతకమంది!
అందరికీ
అవకాశాలూ
సరిపోయే వస్తూత్పత్తి
పంపిణిలో సమాన భాగం
కోరుకోను హక్కుందట
స్వార్థ పరత్వం తెచ్చిన జగడం
ఈర్ష్యాసూయల
రగిలిన పోరూ
రణరంగం
చెప్పిన తీర్పూ
ఒక జాతికి
నెత్తిన కళ్లూ
మరోవర్గపు మహావమానం
పొడ చూపని
ఏదో వ్యవస్థ
సంఘానికి
కొత్త స్వరూపం
వస్తుందట!
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - taruvaata - kuMdurti aaMjaneeyulu ( telugu andhra )