కవితలు నయాగరా 7. ఠాకూర్‌ చంద్రసింగ్‌ - ఏల్చూరి సుబ్రహ్మణ్యం
7. ఠాకూర్‌ చంద్రసింగ్‌ (జులై 43) - సుబ్రహ్మణ్యం
(18వ గార్వాల్‌ రైఫిల్‌ నాయకుడు.
దండి సత్యాగ్రహోద్యమంలో తన దళంతో పాల్గొన్నాడు.
యావజ్జీవ శిక్ష విధించింది ప్రభుత్వం.)
పారతంత్ర్య భారంతో
కుంగుతున్న భరతావని
కుసుమించిన రక్తారుణ కుసుమం!
అఖండ భరతావని
ఆరక వెలిగే మణి దీపం
మా ఠాకూర్‌ చంద్ర సింగ్‌!
పున్నమి వెన్నెలలై పొంగిన
బానిస సంద్రంలో పొర్లిన
మబ్బుల కెరటం
సామ్రాజ్యపు చెలియలి కట్టను
ఛేదించిన రక్త తరంగం!
పొగలు చిమ్ము తుపాకి గుండ్లను
ప్రతిఘటించు బానిస గుండెల
మెరసిన ఆదర్శద్యుతి
చంద్రసింగ్‌ విప్లవ దీక్ష!
300ల ఏండ్ల క్రితం
నాటుకున్న విషవృక్షం
చీకట్లను చిమ్ముతుంటె
విరిసిన చంద్రుడు చంద్రసింగ్‌!
స్వాతంత్ర్యం సాధించను
ప్రజలంతా సాగించిన
సమరంలో చంద్రసింగ్‌
అరుణారుణ జయ పతాక!
ముస్లిములను చంపమన్న
రాజాజ్ఞను నిరసించిన
చంద్రసింగ్‌ నేరస్థుడు!
నల్లకోటు వేసుకున్న
తెల్లటి న్యాయం
చంద్రసింగ్‌ చేతికి
తగిలించెను సంకెళ్లు!
ద్రోహి కాడు చంద్రసింగ్‌
స్వతంత్ర జన రక్తం పిండిన
అధమాధమ పాలక వర్గం పాలిట
భూతమ్మై ఘోషించే
సాగర శంఖం!
కటకటాల వెనుకన
పగిలే రగిలే అగ్నిపర్వతం
స్వతంత్ర భారత భువిలో
ఘణ ఘణమని మ్రోగు ఘంట!
హిందూ ముస్లిం ఐక్యతకై
కట్టిన జ్వాలారుణ తోరణమే
చంద్రసింగ్‌ సైనిక దళ వీర దీక్ష!
కలకాలం గిలగిల వలలో
తన్నుకునే చేపలు కావివి
బానిసలం, పుటుక తోటి
సైనికులం
మా చంద్రసింగ్‌
వీరభూమి భరతావని
యుగయుగాల చీకటిలో
నిలువలేక నిలువలేక
తెరచిన విప్లవ నేత్రం!
స్వతంత్ర భారతమే మీటిన
జన విపంచి పాడిన జాబిల్లి పాట
చంద్రసింగ్‌
రక్తారుణ కుసుమం!
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - Thaakuur.h chaMdrasiMg.h - ElchUri subrahmaNyaM ( telugu andhra )