కవితలు నయాగరా 9. విజయముద్ర - ఏల్చూరి సుబ్రహ్మణ్యం
9. విజయముద్ర (మార్చి 41) - సుబ్రహ్మణ్యం
వినువీధిలో
వికార ప్రేత జీవాలు
కారు మేఘాల బారు
ఆకలో
ఆకలోయని
గోడు గోడుగ
రోదించి
డొక్కలెండి
కనుగుడ్లు
పీక్కుపోయి
కణికెడు కూటికి
ఘూర్ణిల్లిరి!
ముష్టిమూక
ముష్టిమూక
పదండి
పదండి
మెతుక్కు
మూగిన
కుక్కల్లారా!
పదండి
పదండి
కడుపు నిండిన
మెరుపు
ఉరుముతూ
వచ్చింది
గుడ్లురిమి
చూచింది
ధగ ధగ ధగ
భుగ భుగ భుగ
వెన్నాడి
వెన్నాడి
తరిమి కొట్టింది
మెరుపు
బిచ్చగాళ్లను
తరిమి కొట్టింది!
పరుగెత్తి పరుగెత్తి
కాలువిరిగి
సడి తప్పగ
బరువెక్కిన
కనురెప్పలు
మూతల పడి
సోలిపోయి
కుప్పైకూలిరి
బిచ్చగాళ్లు
కుప్పైకూలిరి
కూలిన జీవుల
లోహపాదముల
కసకస
త్రొక్కుచు
విలయముగా
జ్వలియించెను
మెరుపు!
చిందిపోసె
రక్తం!
పడగ చితికిన
పాము లాగున
పైకి దూకి
బిచ్చగాళ్లు
ఒక్కటై
ఒక కేక పెట్టిరి!
మెరుపును మింగిరి!
చల్లారని ఆకలి
చల్లారని చిచ్చుకు
శాంతి శాంతి!
పిడుగులు
పిడుగులు!
విప్లవం విప్లవం
పైకి చిందిన
పచ్చి రక్తం
పురిటి వాకిట
పేద జీవుల
విజయ ముద్రగ
ఎగురుచున్నది
ఎర్ర జెండా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - nayAgarA - vijayamudra - ElchUri subrahmaNyaM ( telugu andhra )