కవితలు యెంకి పాటలు ఆ కాలపు నా యెంకి
21. ఆ కాలపు నా యెంకి
దూరాన నారాజు కేరాయిడౌనో
ఈరోజు నారాత లే రాలపాలో
సీమ సిటుకనగానె
సెదిరిపోతది మనసు
కాకమ్మ సేతైన కబురంప డారాజు
దూరాన నారాజు కేరాయిడౌనో...
కళ్ల కేటో మబ్బు
గమ్మి నట్టుంటాది
నిదరల్లొ నా వొల్లు నీరసిత్తన్నాది
దూరాన నారాజు కేరాయిడౌనో...
ఆవు లంబాయంట
అడిలిపోతుండాయి
గుండెల్లొ వుండుండి గుబులు గుబులౌతాది
దూరాన నారాజు కేరాయిడౌనో...
తులిసెమ్మ వొరిగింది
తొలిపూస పెరిగింది
మనసులో నా బొమ్మ మసక మసకేసింది
దూరాన నారాజు కేరాయిడౌనో...
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - aa kaalapu naa yeMki ( telugu andhra )