కవితలు యెంకి పాటలు గోవు మాలచ్చిమి
31. గోవు మాలచ్చిమి
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు
మనిసికైనా లేని మంచి పోకిళ్ళు
యెంకితో కూకుండి
యింత సెపుతుంటే
తనతోటి మనిసల్లె
తల తిప్పుతాదీ
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు ...
యెంకి సరసాలాడ
జంకుతా వుంటే
సూసిసూడక కన్ను
మూసి తెరిసేదీ
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు ...
కోరి కూకుని నేనె
పోరు పెడుతుంటే
తల్లిడిపు పిల్లల్లె
తెల్లపోతాదీ
గోవు మాలచ్చిమికి కోటి దణ్ణాలు ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - goovu maalachchimi ( telugu andhra )