కవితలు యెంకి పాటలు ముందు గతి
30. ముందు గతి
ఎక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే కొండ నెక్కవే
పక్క సూపులు మాని
పయికెల్లి పోదాము
యెక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే
ముందు నువ్వుంటె నే
కిందా నిలబడగలను
నీ నీడనే తొక్కు
కొని సులువుగ రాగల
నెక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే
నాలుగడుగులేసి
నవ్వుతో పిలు యెంకి
పిలుపు నవ్వే నాకు
ములుగఱ్ఱ కాగలదు
యెక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే
తెల్లన్ని నీ పైట
సల్లంగ యిసురోలె
ఆగాలి నా కాలి
కట్టె బగ బగ మండు
నెక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే
పదిమెట్లు పయికెల్లి
పల్లకుండా సూడు
పగబట్టు పామల్లె
పయికి సర్రున వత్తు
నెక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే
యెల్లెల్లి పయికెల్లి
యిద్దరము కలిసి
మూట లివతల పెట్టి
మునిగి పోదము పైనే
యెక్కవే కొండ నెక్కవే
నా సక్క నెంకీ యెక్కవే
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - muMdu gati ( telugu andhra )