| కవితలు | యెంకి పాటలు | నమిలి మింగిన నా యెంకి |
| 11. నమిలి మింగిన నా యెంకి |
|
యెంకివొంటి పిల్ల లేదోయి లేదోయి యెంకి నా వొంకింక రాదోయి రాదోయి |
|
మెళ్ళో పూసలపేరు తల్లో పూవులసేరు కళ్ళెత్తితే సాలు కనకాబిసేకాలు యెంకివొంటి పిల్ల లేదోయి లేదోయి యెంకి నా వొంకింక రాదోయి రాదోయి |
|
సెక్కిట సిన్నీ మచ్చ సెపితే సాలదు లచ్చ వొక్క నవ్వే యేలు వొజ్జిర వొయిడూరాలు యెంకివొంటి పిల్ల లేదోయి లేదోయి యెంకి నా వొంకింక రాదోయి రాదోయి |
|
పదమూ పాడిందంటె పాపాలు పోవాల కతలూ సెప్పిందంటె కలకాల ముండాల యెంకివొంటి పిల్ల లేదోయి లేదోయి యెంకి నా వొంకింక రాదోయి రాదోయి |
|
తోటంతా సీకట్లె దొడ్డీ సీకటిమయిమె కూటికెళితే గుండె గుబగుబమంటా బయిమె యెంకివొంటి పిల్ల లేదోయి లేదోయి యెంకి నా వొంకింక రాదోయి రాదోయి |
|
రాసోరింటికైన రంగుతెచ్చే పిల్ల నా సొమ్ము - నా గుండె నమిలి మింగిన పిల్ల యెంకివొంటి పిల్ల లేదోయి లేదోయి యెంకి నా వొంకింక రాదోయి రాదోయి |