కవితలు యెంకి పాటలు పడవ
29. పడవ
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు
పాడలేనే యెంకి పదము లీ రొదలో
పడవ సల్లగ నడిపి
పదము సదువంటావు
కస్సుమంటా యేరు
గాలి నెగదోసింది
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు ...
వోరుగాలే పాట
దారి కడతా వుంది
బేటికురికే పాట
నోట గొడతావుంది
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు ...
తలమలుపుకొని పాట
తరలింది కామోసు
దేముడల్లే లోన
తిరుగుతున్నా దేటొ
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు ...
యెన్నెలంటే పాట
కెంత మనసవుతాదో
పాట సాగేతలికి
పయనమే మవుతాదొ
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - paDava ( telugu andhra )