కవితలు యెంకి పాటలు పంటసేలకే పయనం
25. పంటసేలకే పయనం
యీ యేపు నోయావు ఆయేపు నోయావు
జోడావులకు నడుమ నా యెంకి యీడు
జోడుగా నిలుసుంటె నా యెంకి ఆట
లాడతా కలిసుంటె నాయెంకి నన్నె
సూడుమన్నట్టుండు నా యెంకి
ఈయేపు నోయేరు ఆయేపు నోయేరు
యేళ్ళ రెంటికి నడుమ నాయెంకి తలను
పాలకడ వెత్తుకుని నా యెంకి సేత
పూలు పుణుకుకొంట నా యెంకి పూల
బూర వోయిస్తానె నా యెంకి నన్నె
పోలుండుమంటాది నా యెంకి
యీకాడ నోకొండ ఆకాడ నోకొండ
కొండ కోనల నడుమ నా యెంకి పాల
కుండ దించూకోని నా యెంకి గుడికి
దండ మెడతావుంటె నా యెంకి
సూడ రెండేళ్ళ కనిపించు నా యెంకి
ఈసాయ నోసేను ఆసాయ నోసేను
సేల రెంటికి నడుమ నా యెంకి పాలు
పూలు నా కందిచ్చి నా యెంకి సొమ్ము
లేల మన కంటాది నా యెంకి గుండె
జాలి పుట్టిస్తాది నా యెంకి
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - paMTaseelakee payanaM ( telugu andhra )