| కవితలు | యెంకి పాటలు | పిల్లోడు |
| 23. పిల్లోడు |
|
యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి |
|
నెత్తిమూటల నెత్తుకోవాలి కొత్తమడతలు దీసి కట్టాలి అడవిదారులయెంట నడవాలి బరువు మారుసుకొంట పక్కున్న నవ్వాలి |
|
యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి |
|
తాతనాటీ వూసు తలవాలి దారిపొడుగున కీసులాడాలి తప్పునీదే యంట దెప్పాలి దైభ మున్నాడాని దడిపించుకోవాలి |
|
యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి |
|
కతకాడ కూసింత నిలవాలి కతగాడు మావూసె సెప్పాలి నను సూసి పిల్లోడు నవ్వాలి మాలోన మామేటొ మతులిరుచుకోవాలి |
|
యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి |
|
కోనేటిలో తాన మాడాలి గుడిసుట్టు ముమ్మారు తిరగాలి కోపాలు తాపాలు మానాలి యిద్దరము పిల్లోణ్ని యీశుడికి సూపాలి |