కవితలు యెంకి పాటలు సుక్క
34. సుక్క
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ
బారెడైనా కొండ పైకి సాగిందేమొ
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ ...
తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు
కాలు సేతులు పక్క కంటుకొని పోనాయి
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ ...
సుక్కతోనే కొండ లెక్కొత్తు నన్నాడు
మబ్బో మనిసో కొండ మలుపు పరకాయించి
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ ...
వొకటొకటిగా బొట్లు వొదిగి దిగిరావాలి
తోటయెలపల గలగలేటొ యిననీవమ్మ
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ ...
నా సొగసు నన్నైన సూసుకోనీడమ్మ
ఆవు మెళ్ళో మువ్వలట్టె మోగినవేటె
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - sukka ( telugu andhra )