కవితలు యెంకి పాటలు తోట వూసు
13. తోట వూసు
తోటవూసంటే సికాకూ యెంకి
తోటి యెల్లేదాని సోకూ
బంతి సేమంతట్ల
పరువంత మాసింది
మల్లెంటు మెల్లంగ
మారుమొగ మేసింది
తోటవూసంటే సికాకూ యెంకి...
తూర్పేపు మళ్ళేటి
దుబ్బు దుట్రాయేటి
అంటు మామిళ్ళేటి
ఆ వొరస పళ్ళేటి
తోటవూసంటే సికాకూ యెంకి...
గొడ్డూగోదా బెంగ
గొని సిక్కిపోనాయి
గడ్డిమేటిని సూత్తే
కడుపె సెరువౌతాది
తోటవూసంటే సికాకూ యెంకి...
నూతికాడే సోకు
యేతాముదే సోకు
పోయి పాడో యంటె
వో యంట పలికేవి
తోటవూసంటే సికాకూ యెంకి...
బలము సీదాపోయి
బడుగునై పోనాను
కృష్ణా రామా యంట
కూకోవలి సొచ్చింది
తోటవూసంటే సికాకూ యెంకి...
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - tooTa vuusu ( telugu andhra )