కవితలు యెంకి పాటలు
2. వొనలచ్చిమి
జాము రేతిరియేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటె
మెల్లంగ వస్తాది నాయెంకీ సల్లంగ వస్తాది నాయెంకీ
పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె
వొయ్యార మొలికించు నాయెంకీ వొనలచ్చి మనిపించు నాయెంకీ
యెంకివస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె
కాలు కదపాలేదు నాయెంకీ కరిగి నీరౌతాది నాయెంకీ
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి
కూలాస గుంటాది నాయెంకీ కులుకు సూపెడతాది నాయెంకీ
యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
సెందురుణ్నీ తిట్టు నాయెంకీ సూరియుణ్నీ తిట్టు నాయెంకీ
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - vonalachchimi ( telugu andhra )