కవితలు యెంకి పాటలు
3. యెంకి ముచ్చట్లు
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు
దొడ్డితోవకల్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్త నంటాది యెన్నాని సెప్పేది...
యెంకి రాలేదని యెటో సూత్తావుంటె
యెనకాలగా వచ్చి 'యెవురువో' రంటాది యెన్నాని సెప్పేది...
'సిట్టి సేబా' సాని నిట్టూర మేత్తుంటె
మాటా యినబడనట్టు మరియేటో సెపుతాది యెన్నాని సెప్పేది...
'కోడిగూసేసరికి కొంపకెల్లాలి నీ
కోసరమె సెపుతాను కోపమొ' ద్దంటాది యెన్నాని సెప్పేది...
'యెంతసేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్ళలో మనకు తలవొంపు' లంటాది యెన్నాని సెప్పేది...
యెనకెనక సూత్తానె యెల్లుతా వుంటాది
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - yeMki muchchaTlu ( telugu andhra )