కవితలు యెంకి పాటలు యెంకి పయనం
18. యెంకి పయనం
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
ఎడతెగని జలమంట
నడమ నో పడవంట
పడవెక్కి నాయెంకి పయన మయ్యిందంట
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
యెంకేటొ బ్రమపుట్టి
యెనక తిరిగిందంట
సందెగాలికి పడవ సాగిపోయిందంట
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
నీటిగాలికి యెంకి
పై టెగురుతాదంట
పడపోయి నట్టేటొ పడ వెల్లినాదంట
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
పిల్లసిగలో పూలు
కళ్ళిప్పినాయంట
మిడిసిపాటున దోనె మీరిపోయిందంట
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
మెడసాటు పూసోటీ
మినుకుమంటాదంట
పంతాన గంతేసి పడవ పోయిందంట
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
అంసల్లె బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి సురిగి పోయిందంట
పడుకొంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ
కడుపులో సెయ్యేసి కదిపేసినాదీ
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - yeMki payanaM ( telugu andhra )